తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు భారత ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-సర్) కార్యక్రమాన్ని నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఎన్నికల సంఘం దాదాపు 90 వేల మంది సిబ్బందితో పటిష్ఠమైన ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగే బూత్‌ లెవల్‌ అధికారులు 35,985 మంది, వారిని పర్యవేక్షించే సూపర్‌ వైజర్లు 3,596 మంది కాగా.. రాజకీయ పార్టీల తరఫున ప్రతినిధులుగా ఉండే బూత్‌ లెవల్‌ ఏజెంట్లు 49,018 మంది భాగస్వాములు కానున్నారు.ఈ సర్ కార్యక్రమంలో భాగంగా బీఎల్‌వోలు రాష్ట్రంలోని ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలోని ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. ఓటరు జాబితాలో ఇప్పటికే పేరున్న వారికి ముందుగా ముద్రించిన ఎన్యూమరేషన్‌ ఫారాలను అందజేస్తారు. ఓటర్లు తమ పేరు, వయసు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలను సరిచూసుకుని.. ఏవైనా తప్పులుంటే సవరణలు సూచించవచ్చు. ఒకవేళ బీఎల్‌వోలు వెళ్లిన సమయంలో నివాసంలో ఎవరూ లేకపోతే, సదరు ఇంటిని మరో రెండు సార్లు సందర్శిస్తారు. అప్పటికీ అందుబాటులో లేకపోతే ముసాయిదా జాబితాలో వారి పేరు పక్కన మార్క్‌ చేస్తారు. అలా మార్క్‌ పడిన వారు ఆగస్టు నెలలో ఆన్‌లైన్‌ ద్వారా లేదా నేరుగా తహసీల్దార్‌ కార్యాలయంలో ఫామ్‌-8 సమర్పించి తమ ఓటును భద్రపరుచుకోవచ్చు. దీనిని ఆన్‌లైన్ ద్వారా కూడా సమర్పించే వెసులుబాటును ఈసీఐ కల్పించింది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా.. జూన్ 20 నాటికి ఆన్‌లైన్‌లో 2,38,62,322 మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తయింది. ఇంకా 99.64 లక్షల మంది మ్యాపింగ్‌ పెండింగ్‌లో ఉంది. అయితే మ్యాపింగ్‌ పూర్తయిన వారిలో దాదాపు 37.67 శాతం మంది అంటే.. 89,88,175 మంది ఓటర్ల వివరాలలో వివిధ రకాల ధ్రువీకరణ వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఈ తేడాలు ఎక్కువగా ఉన్నాయి. ఆధార్ వివరాలు సరిపోకపోవడం, పేరు, వయస్సు, లింగం మారడం, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండటం, గతంలో భర్త పేరు ఉండి ఇప్పుడు తండ్రి పేరు రావడం వంటి 11 రకాల సమస్యలను గుర్తించారు. ఇలాంటి వారికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసి తగిన గడువు ఇచ్చి, వారు సమర్పించే ఆధారాల ప్రకారం పేర్లను జాబితాలో ఉంచుతుంది.గతంలో అంటే 2002 ప్రాంతంలో వేరే చోట ఉండి ప్రస్తుతం హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు వలస వచ్చి నివసిస్తున్న వారి కోసం ఈసీఐ కేంద్రీకృత డిజిటల్‌ డేటాబేస్‌ను వాడుతోంది. కొత్త నియోజకవర్గంలో ఫారం నింపినప్పుడు సాఫ్ట్‌వేర్ పాత రికార్డులను వెతికి ఆటోమేటిక్‌గా కొత్త రికార్డుతో లింక్ చేస్తుంది. ఒకవేళ 2002 నాటి రికార్డులు లభించకపోతే, ఓటును తొలగించకుండా ప్రస్తుత నివాసానికి సంబంధించిన ఆధార్, కరెంట్ బిల్లు, పాస్‌పోర్ట్ వంటి ప్రత్యామ్నాయ పత్రాలను పరిశీలించి ఓటును జెన్యూన్‌గా ఖరారు చేస్తారు. కొత్త ఓటర్ల విషయంలో వారి తల్లిదండ్రుల 2002 ఓటర్ ఐడీ రికార్డుతో లింక్ చేస్తారు.సవరణలకు కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు..పేరు/ఇంటి పేరు మార్పునకు- ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పదో తరగతి మెమో.వయసు/పుట్టిన తేదీల్లో తేడాలకు- జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మెమో, ఆధార్‌, పాస్‌పోర్టు.బంధుత్వాల తేడాలకు- కుటుంబ రేషన్‌ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ఆధార్, ఓటర్ ఐడీ.పుట్టిన తేదీల నిరూపణకు- 1987 జూలై 1కి ముందు జన్మించిన వారు తమ పుట్టిన తేదీ, స్థల నిర్ధారణ పత్రాలు చూపాలి. ఆ తర్వాత నుంచి 2004 డిసెంబరు 2 మధ్య జన్మించిన వారు తమతో పాటు తల్లిదండ్రుల పుట్టిన తేదీ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.ఎన్నికల అధికారులు స్పష్టం చేసిన వివరాల ప్రకారం.. ఏ ఒక్కరి ఓటునూ ముందస్తు సమాచారం లేదా నోటీసు ఇవ్వకుండా తొలగించే అధికారం ఎవరికీ లేదు. మరణించిన వారివి, రెండు చోట్ల ఉన్న ఓట్లను మాత్రమే తొలగిస్తారు. ఓటర్లు తమ ఓటు స్టేటస్‌ను తెలంగాణ సీఈవో వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ స్పెల్లింగ్ తప్పుల వల్ల పేరు దొరకకపోతే.. బీఎల్‌వోలకు పాత వివరాలు చెబితే వారు బీఎల్‌వో నెట్ యాప్ గ్లోబల్ సెర్చ్ ద్వారా వెతికి అక్కడికక్కడే మ్యాన్యువల్‌గా ట్యాగ్ చేస్తారు. ఈ అవకాశాన్ని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.