కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి.. పదవీ విరమణ చేసిన వెంటనే సీఎస్ రామకృష్ణారావుకు కీలక పదవి

Wait 5 sec.

తెలంగాణ ప్రభుత్వం ఒకే రోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 30వ తేదీతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ కాలం ముగియనుండటంతో.. కొత్త సీఎస్‌గా సంజయ్ జాజును నియమిస్తూ కీలక ఉత్తర్వులు వెలువరించింది. అదే సమయంలో పదవీ విరమణ తర్వాత రామకృష్ణారావుకు కీలక పదవి కూడా అప్పగించింది. ముఖ్యమంత్రి సలహాదారుగా కే రామకృష్ణారావును నియమిస్తూ.. ప్రకటన విడుదల చేసింది. అయితే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కూడా.. తన హయాంలో ఇలాగే రిటైర్ అయిన సీఎస్‌లను ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. ఈ క్రమంలోనే అప్పుడు కేసీఆర్ అనుసరించిన మార్గాన్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అనుసరిస్తున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన కె. రామకృష్ణారావును ముఖ్యమంత్రి సలహాదారుగా నియమిస్తూ.. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ఎం. రఘునందన్ రావు శుక్రవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించారు. రామకృష్ణారావు ఈనెల 30వ తేదీన రిటైర్ అయిన వెంటనే ముఖ్యమంత్రికి సలహాదారుతో పాటు ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొత్త బాధ్యతలు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో వెల్లడించింది.ఈ క్రమంలోనే నియామక కాలపరిమితితోపాటు.. ఆయనకు ఇచ్చే జీతభత్యాలు.. ఇతర సేవా నిబంధనలు, కండీషన్లను త్వరలోనే జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు.. పదవీ విరమణ తర్వాత కీలక బాధ్యతలను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారు. ఇలా రిటైర్ అయిన సీనియర్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించే సాంప్రదాయాన్ని కేసీఆర్ తీసుకొచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన డాక్టర్ రాజీవ్ శర్మ.. 2016 డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే.. డాక్టర్ రాజీవ్ శర్మను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కేసీఆర్ నియమించారు. ఈ క్రమంలోనే ఆయనకు కేబినెట్ హోదాను కూడా కల్పించారు. కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడైన ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న సోమేష్ కుమార్‌కు కూడా కేసీఆర్ పదవి ఇచ్చారు. క్యాట్ ఆర్డర్ వివాదంలో తెలంగాణ హైకోర్టు తీర్పు కారణంగా ఆయన 2023 జనవరిలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లిన సోమేష్ కుమార్.. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నారు. ఈ క్రమంలోనే సోమేష్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్న వెంటనే 2023 మేలో ఆయనను సీఎం ముఖ్య సలహాదారుగా నియమించారు. సోమేష్ కుమార్‌కు కేబినెట్ హోదా ఇచ్చి 3 ఏళ్ల కాలపరిమితితో ఆ పదవిలో నియమించారు.రాజీవ్ శర్మ తర్వాత తెలంగాణ సీఎస్‌గా పనిచేసిన ఎస్‌కే జోషి కూడా పదవీ విరమణ చేసిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమితులు అయ్యారు. ఇక కేవలం ఐఏఎస్ అధికారులే కాకుండా.. ఐపీఎస్ అధికారులకు కూడా రిటైర్మెంట్ తర్వాత పదవులు దక్కాయి. తెలంగాణ తొలి డీజీపీగా పనిచేసిన అనురాగ్ శర్మ.. పదవీ విరమణ చేసిన వెంటనే ఆయనను హోంశాఖ సలహాదారుగా కేసీఆర్ ప్రభుత్వం నియమించింది.ప్రభుత్వాలు మారినా లేక పరిపాలనలో వేగం పెంచాలన్నా.. సీనియర్ అధికారుల సుదీర్ఘ అనుభవం, కీలక శాఖలైన ఆర్థిక, శాంతిభద్రతలు, నీటిపారుదలపై వారికి ఉన్న పట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో అవసరం ఉంటుంది. అందుకే వారు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా.. ప్రభుత్వ అవసరాల మేరకు వారికి ప్రత్యేక పదవులు ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా.. ప్రభుత్వాల్లో కీలకమైన పాలనాపరమైన లూప్‌హోల్స్, బడ్జెట్ రహస్యాలు, రాజకీయ వ్యూహాలు తెలిసి ఉన్న నమ్మకమైన అధికారులను రిటైర్మెంట్ తర్వాత వదిలేయకుండా.. తమతోనే ఉంచుకోవడానికి ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు వారికి ఇలాంటి పదవులను కట్టబెట్టి ఘనంగా వీడ్కోలు ఇస్తుంటారు.