విరాళాల గోల్‌మాల్ ఆరోపణల వేళ అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ తాన తప్పుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. చంపత్ రాయ్‌తో పాటు ట్రస్టీ అనిల్ మిశ్రా కూడా రాజీనామాలను సమర్పించారని ఒక అధికారి ధ్రువీకరించారు. అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాలు పక్కదారిపట్టాయనే ఆరోపణలపై విచారణకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. సిట్ ప్రాథమిక నివేదికను సమర్పించడం, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న కఠిన వైఖరి నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.దాదాపు రూ. 7-7.5 కోట్లు గల్లంతైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దొంగతనం, క్రిమినల్ నమ్మకద్రోహం, దొంగిలించిన ఆస్తిని అక్రమంగా స్వీకరించడం, క్రిమినల్ కుట్ర వంటి సెక్షన్ల కింద పోలీసులు గురువారం నాడు కేసు నమోదు చేశారు. ఆలయంలో నగదు లెక్కింపు బాధ్యతలను చూసే ఆరుగురు ఆలయ సిబ్బంది సహా ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. నిందితులు అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను డబ్బును కాజేస్తూ సీసీటీవీ కెమెరాల్లో అడ్డంగా దొరికినట్టు సమాచారం.‘‘సిట్ ఏర్పాటు చేశామని, దాని నివేదిక అందిన వెంటనే చర్యలు ప్రారంభిస్తామని మేం చెప్పాం... సిట్ నివేదిక వచ్చింది.. వెంటనే చర్యలు మొదలయ్యాయి. నేను చెప్పినట్లే, తప్పొప్పులను వేరుచేసి నిజాన్ని బయటపెడతామని హామీ ఇస్తున్నాను’’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అయితే, ఈ వివాదం రాజకీయ రంగును పులుముకుంది. ఎఫ్‌ఐఆర్‌లో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా వంటి ట్రస్ట్‌కు చెందిన సీనియర్ అధికారుల పేర్లను ఎందుకు చేర్చలేదని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.నిధుల దుర్వినియోగం అంశం ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ బయటపెట్టింది. ఆ తర్వాత, వాస్తవాలను నిర్ధారించడానికి, ఎలాంటి పుకార్లకు తావులేకుండా దర్యాప్తునకు ఆదేశించాలని ఆలయ ట్రస్ట్ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో యూపీ ప్రభుత్వం లక్నో డివిజినల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్‌లతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్రపాటు చేసింది. ఇటీవలే సిట్ ప్రాథమిక నివేదికను సమర్పించి, కీలక సూచనలు చేసింది.జనవరి 2024లో ప్రారంభమైనప్పటి నుంచి రామ మందిరానికి భారీగా విరాళాలు అందుతున్నాయి. గత సెప్టెంబర్‌లో విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, FT2025-25 కాలంలో ట్రస్ట్ దాదాపు రూ. 327 కోట్ల ఆదాయాన్ని నివేదించింది. ఇందులో విరాళాల రూపంలో రూ. 153 కోట్లు, వడ్డీ ఆదాయం రూపంలో రూ. 173 కోట్లు ఉన్నాయి. రామమందిరాన్ని రోజుకు సగటున 70,000 నుంచి 80,000 మంది భక్తులు వస్తుంటారు. వారాంతాలు, పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.