రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సలహాదారుగా నియమించింది. ఈ క్రమంలోనే మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులకు.. బదిలీలు, పోస్టింగ్‌లు కల్పించింది. అదే సమయంలో సీఎంఓ నుంచి అజిత్ రెడ్డిని తొలగించింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ శ్రీధర్‌కు సీఎంఓలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలోనే సబ్యసాచి ఘోష్‌కు హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పగించింది. అదే సమయంలో శైలజా రామయ్యర్‌ను ఈఎఫ్‌ఎస్‌ అండ్‌ టీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది. అహ్మద్ నదీమ్‌కు పొలిటికల్ (జీఏడీ) ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్‌ శ్రీధర్.. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జాకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు ఇచ్చింది.మైన్స్ అండ్‌ జియాలజీ శాఖ అదనపు బాధ్యతలను ఎం.రఘునందన్ రావుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా అజిత్ రెడ్డిని ట్రాన్స్‌ఫర్ చేసింది. హ్యాండ్లూమ్స్ అండ్‌ హ్యాండీక్రాఫ్ట్స్ స్పెషల్ సెక్రటరీగా పి. కాత్యాయని దేవికి పోస్టింగ్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్‌అండ్‌బీ శాఖ స్పెషల్ సెక్రటరీగా కె. గంగాధర్‌ను బదిలీ చేసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా టి. వెంకన్నకు పోస్టింగ్ ఇచ్చింది. టూరిజం డైరెక్టర్‌గా కె. విద్యాసాగర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో కీలకమైన మార్పులకు రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టారు. పాలనా యంత్రాంగాన్ని మరింత పరుగులు పెట్టించడంలో భాగంగా సీఎంవోలో భారీ ప్రక్షాళన చేపట్టింది. గత కొంతకాలంగా సీఎంవోలో కీలక బాధ్యతల్లో ఉన్న అజిత్ రెడ్డిని తీసేసి.. శ్రీధర్‌కు చోటు కల్పించారు. శ్రీధర్ రాకతో సీఎంవోలో పాలనాపరమైన నిర్ణయాలు మరింత వేగం పుంజుకుంటాయని తెలంగాణ సచివాలయ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.