పుణే యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో సూత్రధారులైన సియా గోయల్, ఆమె ప్రియుడు పోలీస్ విచారణలో తప్పించుకోడానికి తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. పుణే రూరల్ పోలీస్ అధికారి ప్రకారం.. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని కేతన్ అగర్వాల్‌కు చెప్పినప్పటికీ, నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడానికి అతడు ఇష్టపడలేదని గోయల్ దర్యాప్తు అధికారులకు తెలిపింది. ఆ తర్వాత అగర్వాల్‌ను హత్యచేయడానికి చేతన్ పథకం వేశాడని ఆమె ఆరోపించింది. అయితే, ఆమే ఈ హత్య చేయమని తనపై ఒత్తిడి తెచ్చిందని చౌదరి చెప్పడం గమనార్హం. అయితే, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఈ కుట్ర మొత్తం గోయల్ పన్నినట్లు తెలుస్తోందని ఆ పోలీస్ అధికారి చెప్పారు.జూన్ 18న పుణే సమీపంలోని లోహగఢ్ కోట వద్ద లోయపడి కేతన్ అగర్వాల్‌ ప్రాణాలు కోల్పోయాడు. తొలుత ఈ కేసును ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా నమోదుచేసిప్పటికీ, హత్యకు కుట్ర జరిగినట్టు అధారాలు లభించడంతో అతడికి కాబోయే భార్య సియా గోల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పుణె రూరల్ ఎస్సీ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. కేతన్ అగర్వాల్ తరచుగా ట్రెక్కింగ్‌కు వెళ్లేవాడని తెలిపారు. మే 31న గోయల్ అతడితో పాటు లోహగడ్ కోటకు వెళ్లి, వించు కటా రిడ్జ్ సమీపంలో హత్యచేయడానికి అనువైన ప్రదేశాన్ని గుర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.జూన్ 4న గోయల్ కేతన్‌ను మళ్లీ కోటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించిందని, కానీ, అతని తల్లి అభ్యంతరం చెప్పడంతో వెళ్లలేదని పోలీసులు తెలిపారు. జూన్ 14న వెళ్లినప్పుడు కొండ అంచు నుంచి తోసివేయడానికి ప్రయత్నించిందని, అయితే ఒక పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడని గిల్ చెప్పారు. ఆ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని నమ్మించి, పాము పేరుతో కౌగిలింతల డ్రామా అడి తిరిగి నమ్మకాన్ని కూడగట్టుకుందని సమాచారం.నాలుగు రోజుల తర్వాత, జూన్ 18న, గోయల్ అగర్వాల్‌తో కలిసి కోటకు తిరిగి వచ్చి, చౌదరి సహాయంతో అతడిని 350 అడుగుల లోతైన లోయలోకి తోసివేసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేర సన్నాహాల్లో భాగంగా గోయల్ జూన్ 6న అగర్వాల్ పాస్‌పోర్ట్‌ను దాచిపెట్టినట్టు కూడా దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు.సియా ప్రియుడు చౌదరి షాపులో పనిచేసే ఉద్యోగి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. జూన్ 18న చౌదరి తన సొంత సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే వదిలిపెట్టి, ఉద్యోగి ఫోన్‌ను లోహగఢ్ కోటకు తీసుకువెళ్లాడని అతడు దర్యాప్తు అధికారులకు తెలిపాడు. ఇదిలా ఉండగా, పుణేలోని ఒక కేఫ్‌లో స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్‌లో, మే 31 నుంచి జూన్ 4 మధ్య గోయల్, చౌదరి కలుసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకు కలుసుకున్నారనే దాని గురించి పోలీసులు వారిద్దరినీ ప్రశ్నిస్తున్నారు.దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసు బృందం గురువారం గోయల్‌ను లోహగఢ్ కోటకు తీసుకువెళ్లింది. సాక్ష్యాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందం కూడా ఆ ప్రదేశాన్ని సందర్శించింది.