శామీర్‌పేట్ తహసీల్దార్ ఆస్తులు రూ.50 కోట్లపైనే.. రూ. కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, భూములు, ప్లాట్లు

Wait 5 sec.

మేడ్చల్ మల్కాజ్‌‌‌‌గిరి జిల్లా శామీర్‌‌‌‌పేట్ మండల తహసీల్దార్‌ సుచరిత అక్రమాస్తులు చూసి.. ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఎమ్మార్వో సుచరితను అరెస్ట్ చేసి, జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ఆమె అవినీతికి పాల్పడినట్లు తేలడంతో ఉన్నతాధికారులు సుచరితను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులకు భారీగా డబ్బు, బంగారం, వజ్రాలు, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయి. ఈ నేపథ్యంలోనే వాటన్నింటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.50 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఏసీబీకి చిక్కిన సుచరితపై భారీగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో గురువారం రోజున సుచరిత నివాసంతో పాటు ఆమె బంధువుల ఇళ్లు సహా సహా మొత్తం 4 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆమె ఇంట్లో రూ.12 లక్షల నగదు.. రూ.1.20 కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాలు సహా మొత్తం రూ.5.5 కోట్ల విలువ చేసే ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శామీర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌ తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన సుచరితపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. శామీర్‌‌‌‌పేట్‌‌‌‌ మండలం అలియాబాద్ గ్రామంలోని పలు సర్వే నంబర్లలో ఉన్న 30 ఎకరాల వ్యవసాయ భూమిని.. వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు పలువురు రైతులు తహసీల్దార్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆ భూమిని మార్చాలంటే ఎకరానికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు ఇవ్వాలని ఆ రైతులను తహసీల్దార్ సుచరిత డిమాండ్‌‌‌‌ చేశారు. అయితే ఒకేసారి అంత డబ్బు ఇచ్చుకోలేమని రైతులు వేడుకోవడంతో.. వాయిదాల పద్దతిలో ఇవ్వాలని.. అలా ఇస్తేనే ఆ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తానని తహసీల్దార్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సుచరిత నుంచి వేధింపులు భరించలేని బాధిత రైతులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మధ్యవర్తి ద్వారా తొలి విడత రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా.. మే 26వ తేదీన సుచరితను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకుని అరెస్ట్‌‌‌‌ చేశారు. ఆ తర్వాత ఆమెను చంచల్‌‌‌‌గూడ మహిళా జైలుకు తరలించి రిమాండ్‌‌‌‌లో ఉంచారు. తాజాగా ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు.. ఆదాయానికి మించి ఆస్తులను సుచరిత కూడబెట్టినట్లు గుర్తించారు. ఇందులో భాగంగానే తాజాగా సోదాలు నిర్వహించగా.. భారీగా ఆస్తులు, సొత్తు, నగదు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంటలో 2.17 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు.. హైదరాబాద్‌‌‌‌లోని పలు ప్రాంతాల్లో 3 ఫ్లాట్లు.. కీసర, ఖానామెట్ ప్రాంతాల్లో 2 ప్లాట్లు ఉన్నట్లు పత్రాలు దొరికాయి. ఆమె ఇంట్లో సుమారు రూ. 12 లక్షల నగదు.. వోక్స్‌‌‌‌వెగన్, హ్యుందాయ్ క్రెటా కార్లను సీజ్ చేశారు. ఇఖ భారీగా బంగారం, వజ్రాల ఆభరణాలు దొరకగా.. వాటి విలువ సుమారు రూ. 1.20 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆమె బ్యాంకు అకౌంట్లలో రూ. 38 లక్షలు ఉండగా.. వాటిని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఈ సోదాల్లో గుర్తించిన మొత్తం ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ.50 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు.