సనత్‍నగర్ టిమ్స్‌ ఆస్పత్రిలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ జారీ.. వచ్చే నెల 6న చివరి తేదీ

Wait 5 sec.

హైదరాబాద్‌లో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే ఆస్పత్రి ఇటీవల ప్రారంభం కాగా.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. పరిపాలన, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ భర్తీ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ ఆస్పత్రికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టిమ్స్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిమ్స్ ఆస్పత్రి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్, తాత్కాలిక ప్రాతిపదికన ఒక ఏడాది కాలపరిమితికి గాను టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, సపోర్ట్ సర్వీసెస్ విభాగాల్లో మొత్తంగా 122 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.టిమ్స్ ఆస్పత్రిలో రెగ్యులర్ నియామకాలు పూర్తయ్యేలోపు.. అక్కడి ప్రజలకు తక్షణమే వైద్య సేవలను అందుబాటులోకి తీసువచ్చేందుకు తాత్కాలిక ఏర్పాట్లలో భాగంగా ఈ నియామకాలను చేపట్టనున్నారు. తాజా నోటిఫికేషన్‌లో టెక్నికల్ విభాగాలకు సంబంధించి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. మొత్తం 122 పోస్టుల్లో టెక్నీషియన్ పోస్టులు 98 ఉండటం గమనార్హం. వీటిలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II విభాగంలో అత్యధికంగా 34 ఖాళీలు ఉన్నాయి. అనస్థీషియా టెక్నీషియన్ విభాగంలో 20 పోస్టులు.. ఎక్స్ రే లేదా సీ ఆర్మ్ టెక్నీషియన్ గ్రేడ్-II విభాగంలో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఈసీజీ టెక్నీషియన్, క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ విభాగాల్లో 6 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు. అదే సమయంలో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ గ్రేడ్-II, సీటీ టెక్నీషియన్ గ్రేడ్-II, ఎంఆర్ఐ టెక్నీషియన్, సీఎస్ఎస్‌డీ టెక్నీషియన్ విభాగాల్లో 4 చొప్పున ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇవే కాకుండా ఈఈజీ టెక్నీషియన్ గ్రేడ్-II, బయోమెడికల్ టెక్నీషియన్ విభాగాల్లో 2 చొప్పున పోస్టులు ఉన్నాయి. ఇక ఆడియోమెట్రీ, ఆడియో విజువల్ టెక్నీషియన్ విభాగాల్లో ఒక్కో పోస్టు చొప్పున భర్తీ చేసేందుకు నిమ్స్ ఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది.అదే సమయంలో సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్.. మరో 24 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్‌లోనే భర్తీ చేయనున్నారు. ఇందులో సీనియర్ అసిస్టెంట్ విభాగంలో 5 ఖాళీలు.. సూపర్‌వైజర్ 4, హెల్త్ ఇన్‌స్పెక్టర్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ లేదా డిప్యూటీ ఫైనాన్షియల్ కంట్రోలర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ఫైనాన్షియల్ కంట్రోలర్, అకౌంటెంట్ విభాగాల్లో 2 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్ రికార్డ్ ఆఫీసర్ (జూనియర్), స్టాటిస్టీషియన్, అకౌంట్స్ ఆఫీసర్ లేదా ఫైనాన్షియల్ కంట్రోలర్ విభాగాల్లో ఒక్కో ఖాళీ ఉంది.ఆయా ఉద్యోగాలకు కావల్సిన విద్యార్హతలు, అనుభవం, వేతనాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆ నోటిఫికేషన్‌లో వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నియామకాల్లో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలిక కాలపరిమితితో భర్తీ చేస్తున్నారని.. ఒప్పంద ప్రాతిపదికన ఉంటుందని స్పష్టంగా తెలిపారు. విధుల్లో చేరినప్పటినుంచి ఏడాది పాటు లేదా రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ పూర్తయ్యే వరకు (ఏది ముందు అయితే అది) ఈ నియామకం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. నిమ్స్ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు చూడొచ్చని స్పష్టం చేశారు.జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000 దరఖాస్తు ఫీజు ఉండగా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించారు. ఈ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) రూపంలో "The Director, NIMS, Hyderabad" పేరుతో చెల్లించాలని పేర్కొన్నారు. ఒక్కో పోస్టుకు 10 లోపు దరఖాస్తులు వస్తే నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 10 నుంచి 30 లోపు దరఖాస్తులు వస్తే మెరిట్ ఆధారంగా స్క్రీనింగ్ చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. 30 కంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు. జూలై 6వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు దరఖాస్తులు చేరేలా పంపించాలని తేల్చి చెప్పారు.