సాధారణంగా రాజకీయ నాయకులు అంటే చాలా కేసులు ఉంటాయి. ప్రజల తరఫున పోరాటం చేసే సమయంలో.. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేసిన సమయంలో పోలీసులు కేసులు నమోదు చేస్తూనే ఉంటారు. ఇక కొన్ని తీవ్రమైన కేసుల్లో జైలుకు కూడా వెళ్లిన వారు చాలానే ఉంటారు. జైలుకు వెళ్లి వచ్చిన నాయకులు అయితే రాజకీయాల్లో మరింత ఎదుగుతూ ఉంటారు. ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే.. ప్రజల్లో అంత ఫాలోయింగ్ ఉంటుంది. అయితే కొన్ని వారు తప్పులు, అవినీతి, కుంభకోణాలు చేసిన కేసులు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులపై ఉన్న కేసులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై 23 కేసులు ఉన్నాయని గుర్తు చేసుకున్న మంత్రి నారా లోకేష్.. ఈ కేసులు చాలా ఎక్కువ అని తాను మొదట అనుకునే వాడిని అని చెప్పారు. అయితే ఒకసారి టీడీపీ సీనియర్ నేత, జేసీ ప్రభాక‌ర్ రెడ్డితో మాట్లాడుతూ ఎన్ని కేసులు ఉన్నాయి అని అడిగానని అప్పుడు ఆయన తనపై 96 కేసులు ఉన్నాయ‌ని సమాధానం చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. 96 కేసులు అంటే అవి చాలా ఎక్కువ అని తాను అనుకున్నాన‌ని వివరించారు. ఇక తెలంగాణ బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజ‌య్ కుమార్.. త‌మ ఇంటికి భోజ‌నానికి వచ్చారని పేర్కొన్న నారా లోకేష్.. ఆయతో సరదాగా న‌వ్వుతూ ఎన్ని కేసులు ఉన్నాయ‌ని అడిగానని చెప్పారు. దానికి ఆయన నవ్వుతూనే సమాధానం ఇస్తూ.. 'ఆ ఏం పెద్ద లేదు అబ్బా నావి 107 కేసులు" అని అన్నట్లు గుర్తు చేసుకున్నారు. అన్ని కేసులు ఉన్నాయంటే.. బండి సంజయ్ ఎంత కష్టపడి ఉంటారని.. ఎంత పోరాడి ఉంటార‌ని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఇంటింటికి ప్రచారం కార్యక్రమాన్ని వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) ప్రక్రియ జరుగుతుండటంతో టీడీపీ నేతలు ఇబ్బందిపడొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల సూచనల మేరకే ఈ మార్పులు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ప్రతీ ఒక్కరి ఓటు చాలా కీలకమైనది అని.. అందుకే నేతలు నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంటూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని నారా లోకేష్ హితవు పలికారు.