‘వారణాసి’లో ఒక్క షాట్ కోసం మహేష్ బాబు 94 టేకులు.. రాజమౌళిపై పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రశంసలు

Wait 5 sec.

మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎస్.ఎస్. తన సినిమాల విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా తెర మీదకు వచ్చే వరకూ నిద్రపోరు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే, షాట్ ఓకే అయ్యేంత వరకూ తీస్తూనే ఉంటారు. ప్రతీ సన్నివేశాన్ని అంత పర్ఫెక్ట్ గా చెక్కుతారు కాబట్టే, ఆయన్ను 'జక్కన్న' అని పిలుస్తుంటారు. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేయడానికి ఆ విధంగా కష్టపడతారు కనుకే, ఆయన్ని 'పని రాక్షసుడు' అంటుంటారు. అయితే ఇప్పుడు 'వారణాసి' సినిమాకి దర్శకధీరుడు రాజమౌళి రెండింతలు ఎక్కువ కష్టపడుతున్నారని తెలుస్తోంది. సూపర్ స్టార్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. తాజాగా పృథ్వీరాజ్ ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా షూటింగ్‌, రాజమౌళి కష్టం, ఆయ‌న క‌మిట్మెంట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాజమౌళి గొప్ప దర్శకుడు మాత్రమే కాదని, ఆయనలో ఒక మంచి నటుడు కూడా ఉన్నారని ప్రశంసించారు. సెట్లో రాజమౌళి మాదిరిగా కష్టపడే డైరెక్టర్ ను తాను ఇప్పటి వరకూ చూడలేదని కొనియాడారు. ''ఉదయం 7 గంటలకు మొదటి షాట్ ఉంటే, రాజమౌళి 5 గంటలకే సెట్స్‌కు వస్తారు. నేను, మహేష్, ప్రియాంక సెట్స్‌కు వచ్చేసరికి ఆయన తన అసిస్టెంట్లతో కలిసి కనీసం 12 సార్లు రిహార్సల్స్ పూర్తి చేస్తారు. కెమెరా క్రేన్‌లను రెడీగా ఉంచుతారు. మమ్మల్ని కూడా ఉదయమే రమ్మంటారా అని అడిగితే.. వద్దు.. ఆ చెప్పిన టైంకు వస్తే చాలాని అంటాడు. లంచ్‌ బ్రేక్‌ కూడా 20 నిమిషాలు మాత్రమే తీసుకుంటాడు. షాట్ రెడీ అనగానే, తినేది కూడా పక్కన పెట్టేసి వెళ్తాడు'' అని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. 'వారణాసి' సినిమాలో ఒకే ఒక్క షాట్ కోసం మహేష్, తాను 94 టేకులు తీసుకున్న విషయాన్ని బయటపెట్టాడు పృథ్వీరాజ్.''రాజమౌళి ప్రతి సినిమాను ఫస్ట్ మూవీగానే భావించి కష్టపడతారు. సినిమా ఛాన్స్ కోసం 20, 30 సంవత్సరాలు వేచి చూసి, ఇన్నాళ్లకు తొలి అవకాశం అందుకున్న కొత్త దర్శకుడిలా ఎంతో కసిగా కనిపిస్తారు. ఒక సీన్ కోసం మహేష్, నేను కలిసి ఉదయాన్నే షూటింగ్ స్టార్ట్ చేశాం. ఒకే ఒక్క షాట్ కోసం మేం 90కి పైగా టేకులు తీసుకున్నాం. అది 94 లేదా 97 టేకులు కావొచ్చు. లంచ్ బ్రేక్ వచ్చింది. షాక్ ఓకే అవ్వలేదు. సరిగ్గా తింటున్న టైంకి షాట్ రెడీ అన్నారు. మళ్లీ సెట్స్ పైకి వెళ్లాం. సాయంత్రం ఆరున్నర అయినా షాట్ ఓకే కాలేదు. దాంతో రాజమౌళి ప్యాకప్ చెప్పాడు. మరుసటి రోజు పొద్దున్నే మళ్లీ అదే సీన్ స్టార్ట్ చేశాం'' అని పృథ్వీరాజ్ వివరించారు.సింగిల్ టేక్ ఆర్టిస్టుగా పేరున్న మహేష్ బాబు కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి ఇన్ని టేకులు తీసుకున్నారంటే.. అది ఎలాంటి షాట్ అనేది అర్థమవుతోంది. ఆ షాట్ ఏంటనేది పృథ్వీరాజ్ వెల్లడించలేదు. ఒక్కోసారి రాజమౌళి చెప్పిన సన్నివేశాలు తనకు అర్థమయ్యేవి కాదని, దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా శ్రమించానని తెలిపారు. రాజమౌళి విజన్‌కు, తన నటనకు మధ్య సెట్స్‌లో చిన్నపాటి యుద్ధమే జరిగిందన్నారు. కానీ ఆయనపై నమ్మకంతో ఏం చెప్తే అది చేశానన్నారు. 'వారణాసి'లో ఒక సీన్ గురించి రాజమౌళి తనకు చెప్పినప్పుడు, ఎలా తీస్తారని అడిగితే.. ఏమో తెలియదని అన్నాడని, కానీ అవుట్‌పుట్ చూశాక ఇంత గొప్పగా ఆ సీన్‌ ఎలా తీశారా అని ఆశ్చర్యపోయానని పృథ్వీరాజ్ చెప్పారు. మోహన్‌ లాల్ తర్వాత తాను చూసిన అత్యుత్తమ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాజమౌళి అని పృథ్వీరాజ్ కొనియాడారు. సెట్స్‌లో ఏదైనా సీన్ చెప్పేటప్పుడు రాజమౌళి ఆ పాత్రలో లీనమవుతారని, ఆ సన్నివేశానికి కావాల్సిన ఎమోషన్స్‌, హావభావాలు అన్నీ స్వయంగా తన ముఖంలో పలికిస్తారని పృథ్వీరాజ్ చెప్పారు. ఆ సన్నివేశం ఎలా చేయాలో, ఎమోషన్ ఎలా ఉండాలో యాక్టర్స్‌కు అర్థం కావడం కోసం ఆ పాత్రలో జీవించి చూపిస్తారని.. దాని వల్ల ఏం కావాలో నటీనటులకు ఈజీగా అర్థమవుతుందన్నారు. రాజమౌళితో వర్క్ చేయడం ఒక గొప్ప ఎక్స్‌పీరియన్స్ అని, ఆయనతో పనిచేయడం వల్ల ఒక నటుడిగా దర్శకుడిగా వ్యక్తిగా తాను ఎంతో పరిణతి సాధించానని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.