బీజేపీ సభ్యత్వం ఉన్నవాళ్లకే భారత పౌరసత్వం.. పాస్‌పోర్టు వివాదంపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

పాస్‌పోర్ట్, భారత పౌరసత్వం అంశంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బహుశా 2030 నాటికి బీజేపీ సభ్యత్వ కార్డు ఉన్నవారిని మాత్రమే భారత పౌరులుగా పిలుస్తామని నరేంద్ర మోదీ ప్రభుత్వం చెబుతోందేమో అని ఎద్దేవా చేశారు. పాస్‌పోర్టు ఉన్నప్పటికీ.. అది పౌరసత్వానికి పూర్తి ఆధారం కాదని.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ చేస్తున్న వాదనలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు దేశ ప్రజల్లో తీవ్ర గందరగోళానికి కారణం అవుతాయని చెప్పారు. భవిష్యత్తులో బీజేపీ సభ్యత్వ కార్డు ఉన్నవారికే పౌరసత్వం ఇస్తారేమోనని ఎద్దేవా చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. బీజేపీ సభ్యత్వ కార్డుల ఫోటోలను తన ట్వీట్‌లో ఉంచారు.పాస్‌పోర్ట్ కేవలం భారత పౌరుడికి మాత్రమే ఇస్తారని పేర్కొన్నారు. 1967 పాస్‌పోర్ట్ చట్టాన్ని చదివితే.. భారత పౌరుడు కాని వారికి పాస్‌పోర్ట్ ఇవ్వరని, పూర్తిస్థాయి పోలీస్ వెరిఫికేషన్ తర్వాత మాత్రమే పాస్‌పోర్ట్ జారీ చేస్తారని ఆ చట్టంలో స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. అలాంటప్పుడు.. పౌరసత్వ ధృవీకరణ పత్రమే రుజువని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే.. రిజిస్ట్రేషన్ లేదా సహజంగా పౌరసత్వం పొందిన వారికి మాత్రమే ఆ ధృవీకరణ పత్రం ఇస్తారని పేర్కొన్నారు.తాను పుట్టుకతో, తన ఇష్టంతో భారత పౌరుడిని అని.. తన తరాలు, తన తాతగారి తాత కూడా ఈ దేశంలోనే పుట్టారని అసదుద్దీన్ ఓవైసీ తేల్చి చెప్పారు. ఏ వ్యక్తిని అయినా యాదృచ్ఛికంగా మీరు భారతీయులా అని అడిగే నియంత్రణను కేంద్ర ప్రభుత్వం తన వద్దే ఉంచుకోవాలని చూస్తోందని తనకు అనిపిస్తోందని ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. భారత పౌరుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే ప్రధాన పత్రాల్లో పాస్‌పోర్టు ఒకటని పేర్కొన్న ఆయన.. అలాంటి పత్రాన్నే పౌరసత్వానికి ఆధారం కాదని చెప్పడం ఆశ్చర్యకరమని తెలిపారు. ప్రభుత్వాలు తరచూ రూల్స్ మార్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తేల్చి చెప్పారు. సొంత దేశంలోనే ప్రజలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు రావడం తీవ్ర బాధాకరమని ఓవైసీ అభివర్ణించారు. గుర్తింపు కార్డులు, పౌరసత్వ అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని హితవు పలికారు. దేశ ప్రజలు పడుతున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం గమనించాలని కోరారు.