తెలంగాణ ముఖ్యమంత్రి తనపై వస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. గతంలో సీఎం పదవి గురించి మాట్లాడుతూ.. గుంపు మేస్త్రీతో పోల్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డిని అంటూ ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ గుంపు మేస్త్రీ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు, ట్రోల్స్‌కు కౌంటర్ ఇస్తూ.. బీఆర్ఎస్ పాలనలో విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడంతో పాటు ఆ పార్టీకి గోరీ కట్టే మేస్త్రీని తానే అంటూ తీవ్రంగా స్పందించారు. అయినప్పటికీ ఈ విమర్శలు ఆగకపోవడంతో.. తాజాగా మరోసారి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక గుంపు మేస్త్రినే అంటూ మరోసారి స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. తనను చాలామంది అలా అవహేళన చేసినా తానేమీ పట్టించుకోనని.. ఏమీ అనుకోను అంటూ వ్యాఖ్యానించారు. తన గుంపులో ఉన్నవారంతా బాగా పనిచేస్తారని.. మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు. మంత్రులు, నేతలతోపాటు ప్రజలు కూడా తన గుంపే అని తేల్చి చెప్పారు. ఆ గుంపే తన బలమని.. తన బలమే తన ప్రతిష్ఠ అని పేర్కొన్నారు. కొంతమంది తాము దొరలం అని గొప్పలు చెప్పుకుంటారని.. అలాంటి పోకడలు తన వద్ద లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు రేవంత్ రెడ్డి సర్ అని పిలిపించుకోవడం కంటే రేవంతన్న అని అంటేనే ఇష్టమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఇష్టం, ప్రేమ ఉంటేనే.. సీఎంను కూడా అన్నా అని పిలుస్తారని స్పష్టం చేశారు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తుంటే తన కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని.. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ మెట్రోను మరింత విస్తరిద్దామని ప్రయత్నాలు చేస్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మూసీ నదిని బాగుచేస్తే బాగుపడేది.. మెట్రోను విస్తరిస్తే ఉపయోగం ఎవరికి అని ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో ఉన్నవాళ్లకు మూసీ, మెట్రోతో పనిలేదేమో కానీ.. హైదరాబాద్‌లో ఉన్న పేద ప్రజలకు అవసరమని రేవంత్‌ రెడ్డి చెప్పారు.