సీనియర్ ఐపీఎస్ అధికారి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30వ తేదీ పీవీ సునీల్ కుమార్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. సోమవారం ఆయనను సర్వీస్ నుంచి రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి మచ్చ లేకుండా తమ సర్వీసును ముగిస్తే.. ప్రభుత్వం పూర్తి పదవీ విరమణ ప్రయోజనాలు అందిస్తుంది. అయితే పీవీ సునీల్ కుమార్ మీద కేసులు, ఆరోపణలు నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం విధుల నుంచి రిలీవ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పీవీ సునీల్ కుమార్ మీద ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులపై జరుగుతున్న విచారణలకు అడ్డంకులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విధుల నుంచి రిలీవ్ చేసినప్పటికీ.. సివిల్ వ్యక్తిగా విచారణలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే సర్వీస్ రూల్స్ ప్రకారం.. ఇలా విచారణలు పెండింగ్ ఉన్న సమయంలో రిలీవ్ చేసినప్పుడు.. ఆ అధికారికి అందాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందవు. కేవలం ప్రొవిజనల్ పెన్షన్ మాత్రమే అందుతుందని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ కేసుల విచారణ పూర్తై దోషిగా తేలికే ఈ పింఛన్ కూడా రద్దు చేసేందుకు అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. 1993 బ్యాచ్‌కు చెందిన పీవీ సునీల్ కుమార్.. వివిధ ఆరోపణల కారణంగా 2025 మార్చి నుంచి సస్పెన్షన్‌లో కొనసాగుతున్నారు. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసుతో పాటుగా అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేశారనే ఆరోపణలు పీవీ సునీల్ కుమార్ మీద ఉన్నాయి. రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్న సమయంలో.. రఘురామను సీఐడీ కస్టడీకి తీసుకుని చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలపై గుంటూరు నగరంపాలెం స్టేషన్‌లో నమోదైన కేసులో పీవీ సునీల్ కుమార్ నిందితుడిగాఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ చీఫ్‌గా పనిచేసిన పీవీ సునీల్‌కుమార్‌.. అగ్రిగోల్డ్‌ బాధితుల చెల్లింపుల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ చీఫ్‌గా, అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండానే విదేశీ పర్యటనలకు వెళ్లారని ఆరోపణలు ఆయనపై ఉన్నాయి . ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తొలుత 2025 మార్చి 2న పీవీ సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత మరో రెండుసార్లు సస్పెన్షన్ పొడిగించింది.