బెంగళూరులో తన నివాసంలో వ్యాపారవెత్త వైశాఖ్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తొలిసారి స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన ఆమె.. ఇంతటి బాధాకరమైన పరిస్థితి గురించి బహిరంగంగా మాట్లాడాల్సి వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదని కృషి వెల్లడించింది. ‘‘నేను ఇలాంటిది రాయాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఇది రాయడానికి గానీ, కనీసం ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయడానికి గానీ నాకు శక్తి గానీ, మానసిక బలం గానీ లేవు’’ అని ఆమె భావోద్వేగంతో రాశారు. తాను మొదట్లో మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, కానీ తనపై, తన స్నేహితులపై, ఇరు కుటుంబాలపై పెరుగుతున్న ఊహాగానాలు, పదేపదే వస్తున్న ప్రశ్నల వల్ల మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆ నటి వివరించారు.గతవారం బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌లోని కృషి తాపండకు చెందిన అపార్ట్‌మెంట్‌లో వ్యాపారవేత్త వైశాఖ్ అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన విషయం తెలిసిందే. ‘‘జరిగినదంతా చూశాక నాకు నా హృదయానికి ఎంతో విలువైన ఒకరిని నేను కోల్పోయాను... ఎల్లప్పుడూ నా వెంటే ఉంటూ, నన్ను రక్షిస్తూ, నిష్కల్మషమైన మనసుతో నా పట్ల ఎంతో శ్రద్ధ చూపిన వ్యక్తి ఆయన. అతడిని కోల్పోవడం మాటల్లో వర్ణించలేని శూన్యాన్ని మిగిల్చింది. ఈ నష్టాన్ని నేను ఎప్పటికీ పూర్తిగా జీర్ణించుకోగలనో లేదో నాకు తెలియడం లేదు... నేను చాలా కాలంగా బాధను మోస్తున్నాను.. ఇప్పుడు ఊహించలేని మరో నష్టానికి దుఃఖిస్తున్నాను.. ఈ క్రమంలో నాలో కొంత భాగాన్ని కోల్పోయినట్లు అనిపిస్తోంది..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సంఘటన చుట్టూ వస్తున్న పుకార్లు, ఊహాగానాలు ఇప్పటికే బాధలో ఉన్న తమ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చేశాయని కృషి వాపోయారు. ‘‘ఓ కుటుంబం తమ కొడుకును పోగొట్టుకుందని, తమను ఎంతగానో ప్రేమించిన మంచి వ్యక్తి స్నేహితులు కోల్పోయారు.. ఒకవైపు ఆయన కుటుంబం, స్నేహితులు, ఆప్తులు ఈ దుఃఖం నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఒకరి మరణాన్ని కథగా మార్చడానికి నిరంతరం ఊహాగానాలు, అంచనాలు, ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి’ అని ఆమె అన్నారు. ఈ కష్టకాలంలో తనకు అండగా నిలిచిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా, డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్న వైశాక్.. వ్యక్తిగత, కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. విబేధాలు తలెత్తడంతో దాదాపు నెల రోజుల నుంచి భార్యతో విడివిడిగా జీవిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. మరణానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలను నిర్ధారించడానికి పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.