నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పేరు బాగా వినిపిస్తుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు భారీగా ఫాలోయింగ్ ఉంటుంది. ఈ కోమటిరెడ్డి సోదరులకు ఉన్న ఫాలోయింగ్‌తోనే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రాజకీయాల్లోనే కాకుండా ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటూ, ఎన్నో మంచి పనులు చేస్తూ.. ఈ ఇద్దరు నేతలు ప్రజల గుండెల్లో నిలుస్తున్నారు. తన కుమారుడి మరణం తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ప్రతీక్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి.. ప్రజలకు ఆర్థిక, విద్య, సామాజిక సేవ చేస్తూ.. ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన సోదరుడిని ఉద్దేశించి.. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఒక ఇంట్రెస్టింగ్ ఘటన చోటుచేసుకుంది. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ.. తనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వివరించింది. తనకు సహాయం చేయాల్సిందిగా మంత్రిని వేడుకుంది. దీనిపై మంత్రి సరదాగా స్పందించారు. మీ మునుగోడులో పెద్ద దానకర్ణుడు.. ఎమ్మెల్యే ఉన్నారు కదా అని పేర్కొన్నారు. ఆయన ఉండగా నేనెలా మీకు ఉపయోగపడతాను అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నవ్వుతూ చమత్కరించారు.ఇక ఆ మహిళ చేసిన విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి వెంకటరెడ్డి.. తాను రూ.50 వేలు, రూ.లక్ష ఇస్తే అక్కడ రాజగోపాల్ రెడ్డి అన్నీ చూసుకుంటాడని.. అయితే తన వద్ద డబ్బులు లేవని పేర్కొన్నారు. మంత్రిగా ఉన్న తానే ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్‌లో ఉంటున్నానని.. రాజగోపాల్ రెడ్డి వద్దకే వెళ్లి గోడు చెప్పుకోండి అని సూచించారు. ఆ తర్వాత ఆమెకు ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. మహిళతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇక తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే పరిచయం అక్కర్లేని వ్యక్తులు. గతంలోనూ మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతగా ఉన్నారు. ఇక ఆయన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. వీరిద్దరూ రాజకీయాల్లోనే కాకుండా దాతృత్వంలోనూ ఎప్పటికప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు.