ఇరాన్‌తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారీ షాక్ తగిలింది. ఇరాన్‌పై యుద్ధ చర్యలకు వ్యతిరేకంగా అమెరికా సెనేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌పై అమెరికా ఇక సైనిక చర్యలను నిలిపివేయాలని ట్రంప్‌ను ఆదేశించే తీర్మానానికి సెనేట్ ఆమోదం తెలిపింది. అనవసరమైన యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోతుందనే కారణంతోనే ట్రంప్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ తీర్మానానికి 50 -48 ఓట్లతో మద్దతు లభించింది. ఈ నెల ప్రారంభంలో ప్రతినిధుల సభ కూడా ఆమోదించింది. దాంతో 1973లో అమల్లోకి వచ్చిన వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం యుద్ధంలో ఉన్న అమెరికా బలగాలను వెనక్కి పిలవాలని అధ్యక్షుడిని కోరుతూ కాంగ్రెస్ రెండు సభలు ఆమోదించిన తొలి తీర్మానంగా ఇది నిలవడం విశేషం. అమెరికా - ఇరాన్ మధ్య ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైంది. సుమారు వంద రోజులకు పైగా సాగిన ఈ యుద్ధం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. అదేవిధంగా కొందరు రిపబ్లికన్ సభ్యులు కూడా ఆందోళన చేపట్టడంతో తీర్మానానికి మద్దతు లభించింది. ఈ ఓటింగ్ పార్టీ విధానాల ప్రకారమే జరిగింది. అన్ని డెమోక్రాట్లలో ఒకర్ని మినహాయించి మిగతా సభ్యులంతా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. నలుగురు రిపబ్లికన్ సభ్యులు కూడా వారికి మద్దతు ఇచ్చారు. ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు ఓటింగ్‌లో పాల్గొనలేదు. యుద్ధాన్ని ఆపేయాలంటూ చేసిన ఈ తీర్మానం ట్రంప్ సంతకం కోసం వైట్ హౌస్‌కు మాత్రం వెళ్లదు. ఎందుకంటే వైట్‌హైస్ సెనేటర్లు చేసిన ఈ తీర్మానం రాజ్యంగబద్ధం కాదని, తమపై ఇది బలవంతంగా అమలు కాదంటూ స్పష్టం చేసింది. దాంతో ఈ అంశం కోర్టులో తేలే అవకాశం ఉంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో కూడా ఈ తీర్మానం 215 - 208 ఓట్లతో ఆమోదం పొందింది. అక్కడ కూడా నలుగురు రిపబ్లికన్ సభ్యులు డెమోక్రాట్లతో కలిసి మద్దతు తెలిపారు. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం చర్చలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో యుద్ధం దాదాపు ముగిసేపోయే పరిస్థితి ఉందనే చెప్పొచ్చు.