భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ యూడీఎఫ్ ఖరారు.. ఎవరెవరికి ఎంతంటే, ఛార్జీల వివరాలివే!

Wait 5 sec.

విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం దాదాపుగా ఫిక్స్ అయ్యింది. జులై 8 నుంచి సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ పీపీపీ మోడ్‌లో నిర్మించగా.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంగా అభివృద్ధి చేశారు. తాజాగా ఏఈఆర్‌ఏ (ఎయిర్‌ పోర్టు ఎకనామిక్‌ రెగ్యులేటరీ అథారిటీ) ప్రయాణికుల టికెట్‌పై వసూలు చేసే యూడీఎఫ్‌ (యూజర్‌ డెవలెప్‌మెంట్‌ ఫీజు) టారిఫ్‌‌పై క్లారిటీ వచ్చేసింది.. తాత్కాలికంగా ఈ యూడీఎఫ్‌ను ఖరారు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరే డొమిస్టిక్ (దేశీయ) ప్రయాణికులకు రూ.835, వచ్చే ప్రయాణీకులకు రూ. 355 ఉంటుంది. ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ప్రయాణికులైతే.. బయలుదేరే వారు రూ.1,255, అక్కడికి వచ్చేవారికి రూ.545గా ఫిక్స్ చేశారు. విమానాశ్రయంలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఈ తాత్కాలిక టారిఫ్‌ అమలులోకి వచ్చే అవకాశం ఉంది.అంతేకాదు మౌలిక సదుపాయాలను ఉపయోగించుకున్నందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు చెల్లించాల్సిన ఛార్జీలను కూడా ఖరారు చేశారు. దేశీయ విమానయాన సంస్థలు విమానం యొక్క గరిష్ట టేకాఫ్ బరువులో ప్రతి మెట్రిక్ టన్నుకు (MT) రూ. 1,400 చొప్పున ల్యాండింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే అంతర్జాతీయ (ఇంటర్నేషనల్) ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రతి MTకి రూ. 1,975 చెల్లిస్తాయి. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి కార్యకలాపాలను విస్తరించుకునేలా ఎయిర్‌లైన్స్ సంస్థలను ప్రోత్సహించడానికి, అదనపు విమాన సర్వీసులు, కొత్త మార్గాలకు ప్రోత్సాహకాలను అందించే వేరియబుల్ ల్యాండింగ్ ఛార్జీల పథకాన్ని ఏఈఆర్ఏ (AERA) ఆమోదించింది.ఇప్పటికే ఉన్న మార్గాల్లో కొత్త సేవలను ప్రవేశపెట్టే ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రామాణిక ల్యాండింగ్ ఛార్జీలో 80 శాతం చెల్లిస్తాయి. కాగా కొత్త మార్గాలను ప్రారంభించేవి ప్రామాణిక రేటులో 60 శాతం చెల్లిస్తాయి. అంతేకాదు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ల్యాండ్ అయ్యే దేశీయ విమానాలకు సాధారణ ల్యాండింగ్ ఫీజులో కేవలం 25 శాతం మాత్రమే వసూలు చేస్తారు. కాగా ప్రత్యేక సరుకు రవాణా విమానాలకు ల్యాండింగ్ ఛార్జీల నుండి మినహాయింపు ఉంటుంది. మొదటి రెండు గంటల పాటు విమానాల పార్కింగ్ ఉచితంగా ఉంటుంది. ఆ తర్వాత మాత్రం పార్కింగ్ ఛార్జీలు గంటకు ప్రతి మెట్రిక్ టన్నుకు రూ. 19 చొప్పున.. ఎక్కువ సమయానికి గంటకు ప్రతి మెట్రిక్ టన్నుకు రూ. 23 చొప్పున విధిస్తారు.కామన్ యూజ్ టెర్మినల్ ఎక్విప్‌మెంట్ (CUTE), కామన్ యూజ్ సెల్ఫ్-సర్వీస్ (CUSS), బ్యాగేజ్ రికన్సిలియేషన్ సిస్టమ్స్ (BRS) వంటి ప్యాసింజర్ ప్రాసెసింగ్ సిస్టమ్‌ల కోసం కూడా విమానాశ్రయం ఛార్జీలను వసూలు చేస్తుంది. రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్లు, విధుల్లో ఉన్న విమాన సిబ్బంది, అర్హత కలిగిన ట్రాన్సిట్ ప్రయాణికులతో సహా కొన్ని వర్గాల ప్రయాణికులకు యూడీఎఫ్ చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఉడాన్ కింద నిర్వహించబడే విమానాలకు ప్రస్తుత నియమ నిబంధనల ప్రకారం మినహాయింపులు కొనసాగుతాయి.