పవిత్రమైన వారణాసి గంగానదిలో పడవపై చికెన్, బీర్ పార్టీ.. వీడియో వైరల్, ఐదుగురు అరెస్టు

Wait 5 sec.

హిందువులకు అత్యంత పవిత్రమైన స్థలం వారణాసి. కాశీ యాత్ర చేయాలని ప్రతీ హిందువుకు ఉంటుంది. అక్కడ గంగానదిలో పుణ్య స్నానం చేస్తే ఈ జన్మ ధన్యమవుతుందనేది హిందువుల భావన. అలాంటి గంగానది ఘాట్ వద్ద చికెన్ వండుతూ, బీర్ తాగుతూ పార్టీ చేసుకున్న ఘటన ఇప్పుడు కలకలం రేపింది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెంటనే స్పందించిన పోలీసులు ఈ ఘటనకు సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్టు చేశారు. గంగానదిలోని దశాశ్వమేధ్ ఘాట్ వద్ద నిలిపిన ఓ పడవపై ఎనిమిది మంది యువకులు చికెన్ వండుకుంటూ, బీర్ తాగుతూ పార్టీ చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కనిపించింది. అందులో వీడియో తీస్తున్న వ్యక్తి మాట్లాడుతూ మేమంతా పార్టీ చేసుకుంటున్నామని చెప్పాడు. పార్టీ చేసుకున్న తర్వాత వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఆ వీడియోపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనురాగ్ సైనీ, రాహుల్ సైనీ, అజయ్ సైనీ, దీపక్ కుమార్, అరుణ్ కుమార్ అనే ఐదుగురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉండగా, వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఈ వీడియో ఇప్పటిది కాదని.. పాత వీడియో అంటూ దశాశ్వమేధ్ పోలీసులు చెబుతున్నారు. ఎప్పటి వీడియో అయినప్పటికీ మతపరమైన భావోద్వేగాలు దెబ్బతీసేలా ఉండటంతో మత విధ్వేషాలు రెచ్చగొట్టడం వంటి సెక్షన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. గంగానదిపై పడవలో ఇదే తరహా ఘటన ఈ ఏడాది మార్చిలో రంజాన్ సందర్భంగా చోటుచేసుకుంది. అప్పట్లో 14 మంది ముస్లింలు గంగానదిపై ఇఫ్తార్ చేసుకుంటూ చికెన్ బిర్యానీ తిన్నారని, మిగిలిపోయిన ఆహారాన్ని నదిలో పడేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆ వీడియోలు వైరల్ కావడంతో వారిని వెంటనే అరెస్టు చేశారు. ప్రస్తుత ఘటనలో కూడా వీడియోలు పాతవే అయినప్పటికీ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉండటంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసి నిందితులను న్యాయస్థానానికి తరలిస్తామని పోలీసులు వెల్లడించారు.