ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. ఆంధ్రప్రదేశ్‌ లాగా ఇబ్బందులు వద్దు.. మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు

Wait 5 sec.

ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తుందని రవాణా శాఖ మంత్రి తేల్చి చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియపై ముమ్మరంగా కసరత్తు చేశామని స్పష్టం చేసిన మంత్రి పొన్నం.. విలీనం తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చేస్తున్నట్లు వివరించారు. ఏపీ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం అయిన తర్వాత ఇబ్బందులు వచ్చాయని.. అలాంటివి మన దగ్గర రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే కొంతమంది కార్మిక సంఘాల నేతలు.. నిజాలను వక్రీకరించి.. ఆర్టీసీ కార్మికులను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలు.. 2021 పీఆర్సీ.. .. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 3 కీలక అంశాలు అని పేర్కొన్న మంత్రి.. 11 శాతం పీఆర్సీ.. జూలై నెల జీతం నుంచే అమల్లోకి రానుందని తెలిపారు. కార్మికుల మొదటి డిమాండ్ ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలని.. ఇప్పుడు మాట మార్చుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి విధివిధానాలు రూపొందించే అధికారుల కమిటీలో.. కార్మిక ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలని కార్మికులు తేల్చి చెప్పినట్లు గుర్తు చేశారు. అయితే ఆ కమిటీలో ఉండే కార్మిక నాయకులు.. గుర్తింపు పొందిన సంఘం నుంచి ఉండాలంటే ముందుగా వాటికి ఎన్నికలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎన్నికల నోడల్ అధికారిగా లేబర్ జాయింట్ కమిషనర్ సునీతను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసి.. త్వరలోనే గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించే దిశగా వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తేల్చి చెప్పారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకే.. ముందుగా గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించి.. ప్రతినిధులను విలీన కమిటీలో చేర్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిరి విలీనం తర్వాత ఇబ్బందులు కలగవద్దని.. గుర్తింపు పొందిన కార్మిక సంఘాల నేతలను ఆ కమిటీలో చేర్చి ప్రభుత్వంలో విలీనం చేసేందుకు విధివిధానాలు తయారు చేసేలా నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది కార్మిక సంఘాల నాయకులు.. గుర్తింపు సంఘాల ఎన్నికలు జరగకుండా.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం జరిగే ప్రక్రియను వివాదాస్పదం చేయడం సరికాదన్నారు. ప్రతీ హామీని నెరవేర్చేందుకు సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని.. కార్మికులు నిజాలను గుర్తించి అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. విలీన ప్రక్రియ భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు.