తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శనివారం రోజున రికార్డుస్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో సాధారణంగా రోజుకు సగటున 85 వేల నుంచి 87 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే శనివారం రోజున చరిత్రలోనే చాలా అరుదుగా లక్షన్నర మందికి పైగా భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలి వచ్చారు. ఇంత భారీ సంఖ్యలో భక్తులు రావడంతో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ శ్రీవారి భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, క్యూ లైన్లలో అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.శనివారం రోజున ఊహించని విధంగా భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్న నేపథ్యంలో.. భక్తులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. ఆదివారం రోజు కూడా కోసం భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో..టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసింది. అందరినీ విధుల్లో కొనసాగిస్తున్నామని, అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించినట్లు వెంకయ్య చౌదరి తెలిపారు.సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకు వీలుగా సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆన్ లైన్‌లో జారీ చేసే శ్రీవాణి కరెంట్ బుకింగ్ టికెట్ల కోటాను రద్దు చేసినట్లు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఎస్‌ఎస్‌డీ దర్శనాల కోటాలను కూడా అవసరమైన మేరకు తగ్గించి .. ఆ సమయాన్ని సర్వదర్శనం భక్తులకు వినియోగిస్తున్నట్లు వివరించారు. మరోవైపు భక్తుల రద్దీతో తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయాలు, క్యూ లైన్లు నిండిపోయాయి. అయితే భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, అన్నప్రసాదం, ఇతర మౌలిక సేవలను టీటీడీ నిరంతరాయంగా అందిస్తోంది. మరోవైపు సోమవారం రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన నేపథ్యంలో ఆదివారం రోజు వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ తెలిపింది. అలాగే శ్రీవాణి కరెంట్ బుకింగ్ కోటా 800 టికెట్ల జారీని కూడా రద్దు చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గమనించుకుని.. తిరుమలకు షెడ్యూల్ రూపొందించుకోవాలని సూచించింది. రద్దీ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునే సమయంలో ఎక్కువ సేపు నిలబడకుండా త్వరగా దర్శించుకుని క్యూలైన్లో వెనుక ఉన్న వారికి స్వామి వారి దర్శన భాగ్యం కలిగే అవకాశం కల్పించాలని భక్తులను టీటీడీ కోరింది.