23 ఏళ్ల తర్వాత చిక్కిన నేరస్తుడు.. హత్య కేసులో జైలుకెళ్లొచ్చి.. పేరు, ఊరు మార్చేసి పెళ్లి..!

Wait 5 sec.

'తప్పు చేసిన వారు తప్పించుకున్నా ఎప్పుడో ఒకప్పుడు దొరకకుండా పోరు' అని పెద్దలు ఒక సామెత చెబుతూ ఉంటారు. ఇక పాత నేరస్తులు.. నేరాలు చేసి దొరికిపోయి.. ఆ తర్వాత తప్పించుకు పారిపోయిన వారు.. చాలా ఏళ్లకు దొరికిపోయిన కేసులో ఇటీవలి కాలంలో చాలా చూస్తూ ఉన్నాం. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ పాత నేరస్తుడు.. ఇలాగే పోలీసులకు దొరకకుండా వేషం, రాష్ట్రం మార్చేసి తిరుగుతున్నా.. 23 సంవత్సరాల తర్వాత దొరికిపోయాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్‌ 12లోని సయ్యద్‌ నగర్‌లో నివసించే అర్షద్‌ అలీ అనే 50 ఏళ్ల వ్యక్తి.. 2003లో కనిపించకుండా పోయాడు. అయితే బంజారాహిల్స్, నిజామాబాద్‌ ఐదో టౌన్‌ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చిన అర్షద్ అలీ.. ఆ తర్వాత వనస్థలిపురంలో ఓ చోరీ కేసులో మళ్లీ దొరికిపోయాడు. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేసి మళ్లీ జైలుకు పోలీసులు పంపించగా.. ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చాడు. అనంతరం పలువురిపై బెదిరింపులకు పాల్పడటంతో అర్షద్ అలీపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన నిందితుడు అర్షద్ అలీ.. తన మకాం మహారాష్ట్రకు మార్చాడు. అక్కడికి పారిపోయి.. పాల్ఘర్ జిల్లా వసాయి గ్రామానికి వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అర్షద్ అలీ అనే పేరును కాస్తా.. షకీల్‌గా మార్చుకుని.. అక్కడే రేష్మ అనే మహిళను పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అర్షద్ అలీ కోసం అప్పటి నుంచి పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు.ఈ క్రమంలోనే అర్షద్ అలీపై రౌడీషీట్‌ కూడా తెరిచారు. అతడిపై జారీ అయిన అరెస్ట్ వారెంట్‌ కూడా ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే అర్షద్ అలీ కేసును సవాల్‌గా తీసుకున్న బంజారాహిల్స్ సీఐ సుహాసన్.. ఎలాగైనా అతడిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఐ బీ శ్రీనివాస్.. ఏఎస్‌ఐ ముజఫర్, హెడ్‌కానిస్టేబుల్‌ సుభాష్‌లతో ఓ స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసి.. అర్షద్ అలీ కోసం గత 2 నెలలుగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే అతడి కదలికలపై దృష్టి పెట్టిన పోలీసులు.. టెక్నాలజీ ఆధారంగా మహారాష్ట్రలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అర్షద్ అలీని హైదరాబాద్‌ తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు.