రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు పోసేవారికి భారీ ఫైన్లు.. మల్కాజిగిరి కార్పొరేషన్ వార్నింగ్

Wait 5 sec.

హైదరాబాద్‌ నగరంలో వ్యర్థాల నిర్వహణ.. కార్పొరేషన్ అధికారులకు అతిపెద్ద తలనొప్పిగా మారుతోంది. మామూలు చెత్తతోపాటు.. నిర్మాణ వ్యర్థాలను కూడా కొంతమంది తమ ఇష్టారీతిన రోడ్లు, ఖాళీ స్థలాల్లో పారేస్తున్నారు. దాని వల్ల ప్రజల ఆరోగ్యంతోపాటు.. పర్యావరణం కూడా పాడవుతోంది. అయితే అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఇలా చెత్తను పారేయొద్దని చెప్పినా నగరవాసులు వినడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై పడేసే వారికి భారీగా జరిమానాలు విధించేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించి.. రోడ్లపై, ఖాళీ స్థలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలను పోస్తే భారీ జరిమానాలతోపాటు.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూల్స్ ఉల్లంఘించిన వారికి ఫైన్లతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధిక లోడ్, అక్రమంగా డంపింగ్ విషయంలో తొలిసారి రూల్స్ అతిక్రమిస్తే రూ.25 వేల జరిమానా విధిస్తామని చెప్పారు. అదే తప్పు రెండోసారి చేస్తే రూ.50 వేలు.. మూడోసారి కూడా రూల్స్ ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానాతోపాటు ఆ వ్యర్థాలను తీసుకొచ్చే వాహనాలను కూడా సీజ్ చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకునేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మల్కాజిగిరి కార్పొరేషన్ అధికారులు తేల్చి చెప్పారు. గుర్తింపు పొందిన ప్రాసెసింగ్ ప్లాంట్లకు మాత్రమే నిర్మాణ వ్యర్థాలు, భవన నిర్మాణ కూల్చివేతల వ్యర్థాలను తరలించాలని సూచించారు. రోడ్లు, ఖాళీ స్థలాలు, నాలాలు, ఇతర ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్థాలను పారేస్తే కఠిన చర్యల తప్పవని హెచ్చరించారు. ఇక నిర్మాణ వ్యర్థాల సేకరణ, రవాణా ఛార్జీలను టన్నుకు రూ. 426గా చెల్లించాల్సి ఉంటుందని.. అదే సొంత వాహనాల్లో వ్యర్థాలను తీసుకువస్తే టన్నుకు రూ.106లు చెల్లించాల్సి ఉంటుందని కార్పొరేషన్ అధికారులు తేల్చి చెప్పారు. ప్రజారోగ్యం, పర్యావరణం దృష్టిలో పెట్టుకుని ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా రూల్స్ పాటించాలని మల్కా్జిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.