తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో ఆధునీకరించిన డిస్పెన్సరీని ప్రారంభించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు అత్యవసర వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు డిస్పెన్సరీలో ఈసీజీ, ఆక్సిజన్ సదుపాయం, ఆధునిక వైద్య పరికరాలు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. నలుగురు డాక్టర్లతో పాటుగా 16 మంది పారామెడికల్ సిబ్బంది సేవలందిస్తారు. అలాగే 24 గంటల అంబులెన్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.. పరిస్థితిని బట్టి వారిని అశ్విని ఆస్పత్రికి తరలించేందుకు ఉపయోగపడుతంది. ఇక్కడ భక్తులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తారు.అంతేకాదు గతేడాది టీటీడీ అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో కూడా డిస్పెన్సరీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఏడో మైలు దగ్గర ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ డిస్పెన్సరీ తిరుమల నుంచి తిరుపతికి వాహనాల్లో వెళ్తుంటే దిగువ కనుమ దారిలో వస్తుంది. నడకదారిలో తిరుమలకు వెళ్లే భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు వినియోగించుకునేలా దీనిని ఏర్పాటు చేశారు.. ఈ డిస్పెన్సరీలో వసతులు ఉన్నాయి. అలాగే ఇప్పటికే శ్రీవారి మెట్టుమార్గంలోనూ పీహెచ్‌సీ ఉంది. తిరుమలకు నడిచి వచ్చే భక్తులు అనారోగ్య సమస్యలు తలెత్తితే ఈ కేంద్రంలో తక్షణ చికిత్స పొందవచ్చు.తిరుమలలో జ్యేష్ఠాభిషేకంతిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్టమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేట్లుగా ప్రతి సంవత్సరం మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు 1990వ సంవ‌త్సరంలో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఋత్వికులు శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేదపండితులు శ్రీసూక్తం, భూ సూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణ సూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరించారు. సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు వజ్రకవచంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. తిరుచానూరులో తెప్పోత్సవాలుతిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం పద్మసరోవరంలో శ్రీ సుందరరాజ స్వామివారు తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించారు. ఉదయం సుప్రభాతం, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం జరిపారు. సాయంత్రం ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేసి, తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సుందరరాజ స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.