కేంద్రాన్ని ఒప్పించిన ఏపీ ప్రభుత్వం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, జులై 2న ఫిక్స్

Wait 5 sec.

కేంద్ర పథకమైన వీబీ జీ రాం జీ (వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్‌) ప్రారంభ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన వీబీ జీ రాం జీని జాతీయ స్థాయిలో ఇక్కడే ప్రారంభించనున్నారు. జులై 2న ఉదయం 11 గంటలకు తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లెలో ప్రారంభిస్తారు. ఈ వీబీ జీ రాం జీ ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారు.ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీబీ జీ రాం జీ పథకాన్ని ఏపీలో ప్రారంభించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కోరారు. పవన్ రిక్వెస్ట్‌పై సానుకూలగా స్పందించి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఏపీలో ప్రారంభించేందుకు ఓకే చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కృష్ణతేజ, తిరుపతి జిల్లా అధికారులు రైల్వేకోడూరు నియోజకవర్గంలో పర్యటించారు.. అనంతరం ముక్కవారిపల్లెలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభోత్సవం అప్పటి యూపీఏ ప్రభుత్వం 2006 ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీబీ జీ రాం జీ పథకం కూడా ఏపీలోనే మొదలుకానుంది.కేంద్ర ప్రభుత్వం MGNREGA (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం)ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎంజీనరేగా స్థానంలో ‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌-గ్రామీణ్‌’ (VB-G RAM G Act)ను తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టాన్ని జులై 1నుంచి అమలు చేయనున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల చట్టబద్ధమైన వేతన ఉపాధికి హామీ ఇస్తారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు ఆదాయ కల్పన, జీవనోపాధి భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ ప్రజల్లో పరివర్తనను తీసుకరావడమే లక్ష్యమంటున్నారు.గతంలో ఉన్నMGNREGA నుంచి వీబీ జీ రాం జీ కొత్త విధానానికి మారే ప్రక్రియలో కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వేతనాలను నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలు లేదా పోస్ట్‌ ఆఫీస్‌ ఖాతాల్లో జమ చేస్తారు. అంతేకాదు జాబ్ కార్డులు లేని కార్మికులు గ్రామ పంచాయతీలో నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తం మీద వీబీ జీ రాం జీ పథకం ప్రారంభానికి ఏపీ వేదిక కాబోతోంది.