మార్కెట్‌లో ముసలమ్మను చూసినా భయపడాల్సిందే.. రష్యాను వణికిస్తోన్న ఉక్రెయిన్ ‘మంత్రగత్తెల సైన్యం’

Wait 5 sec.

ఫిబ్రవరి 2022లో ప్రారంభమైన ఉక్రెయిన్- రష్యా యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం రికార్డును బద్దలుకొట్టింది. ఈ యుద్ధం మొదలైన కొత్తలో రష్యా ఆక్రమిత ప్రాంతాలలోని ఉక్రెయిన్ ప్రతిఘటన బహిరంగంగా ఉండేది. ఉక్రెయిన్‌కు చెందిన ఓ వృద్ధురాలు రష్యా పారాట్రూపర్ చేతిలో సన్‌ఫ్లవర్ సీడ్స్ పెట్టి ‘‘నువ్వు చనిపోయాక ఇక్కడ పొద్దుతిరుగు పువ్వులు మొలుస్తాయి’’ అని చెబుతున్న వీడియో అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాటి నుంచి ఇప్పటికి వరకు విషయాలు మారాయి. ఇప్పుడు ఆ ప్రతిఘటన నిశ్శబ్దం ప్రణాళికలోకి మారింది.ఉక్రెయిన్‌‌లో చొరబడిన రష్యా సైనికుడికి ఈ నిశ్శబ్ద ప్రతిఘటన తాలూకు రుచి మొదటిసారి తెలిసొచ్చింది. యుద్ధ విశేషాల పట్ల ఆసక్తి గల ఉక్రెయిన్‌కు చెందిన ఒంటరి గృహిణితో తాను క్లోజ్‌గా ఉంటున్నానని అతడు గత కొన్ని నెలలు నమ్మాడు. వాళ్లేదో ముందునుంచి ప్రేమికుల్లా రోజువారీ విషయాలను పంచుకునేవారు. ఒకరోజు అతడు ఎక్కడ ఉన్నాడో చూడాలని ఉందని ఆమె కోరడంతో తన లొకేషన్ ఫోటో పంపాడు. ఆ ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా చిన్నగా వారి సైనిక స్థావరం మ్యాప్ కనిపించింది.వాస్తవానికి అక్కడ ఆ మహిళ అసలు లేదు! ది అట్లాంటిక్ నివేదిక ప్రకారం.. ఆ సోషల్ మీడియా ఖాతాను నడిపేది ఉక్రెయిన్ సైనిక నిఘా విభాగానికి చెందిన ఒక పురుష అధికారి. ఆ ఫోటో అందిన కొద్దిసేపటికే రష్యా సైనిక స్థావరంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. గత నాలుగేళ్లలో ఉక్రెయిన్ యుద్ధ వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు, ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లతోనే యుద్ధాన్ని సాగిస్తోంది. చిన్న చిన్న వివరాలను సేకరించి, వాటిని లొకేషన్ కోఆర్డినేట్స్‌గా మార్చి, ఆ వెంటనే డ్రోన్ దాడులు జరపడం ఇప్పుడు కీవ్ ప్రధాన వ్యూహం. ఈ వ్యూహాల వెనుక మహిళలు లేదా వారిలా నటిస్తున్న పురుషులు కీలక పాత్ర పోషిస్తున్నారు .‘విద్మా’ ఉక్రెయిన్ సైనిక కమాండర్లు తమ మహిళా ఏజెంట్ల గురించి మాట్లాడేటప్పుడు తరుచూ ఒక ‘విద్మా’ అనే పదం వాడుతుంటారు. ఉక్రేనియన్ జానపద కథల నుంచి వచ్చిన ఈ పదానికి ‘మంత్రగత్తె’ లేదా ‘మాయావిని’ అని అర్థం. ఎవరికీ తెలియని రహస్య జ్ఞానం తెలిసిన స్త్రీలను ‘విద్మా’ అని పిలుస్తారు. ది అట్లాంటిక్‌తో ఉక్రెయిన్ మాజీ ఎంపీ లెస్సియా ఒరోబెట్స్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో ఇలాంటి మహిళలను వారి తెలివితేటల కోసం గౌరవిస్తారు, పాతకాలంలా మంత్రగత్తెలుగా భావించి తగులబెట్టరని అన్నారు. వీళ్లు ప్రతిరోజూ ఉదయం రష్యా చెక్‌పోస్టుల నుంచి సాదాసీదాగా కూరగాయల బ్యాగులతో వెళ్తుంటారు. రష్యా ఆధీనంలో ఉన్న క్లినిక్‌లు, స్కూళ్లలో పనిచేస్తుంటారు. రష్యా స్వచ్ఛంద సంస్థలలో వాలంటీర్లుగా చేరుతూ అక్కడి ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా గమనిస్తుంటారు. మిలిటరీ భాషలో వీరే అత్యంత విలువైన 'ఆస్తులు' .మారియుపోల్ నుంచి తప్పించుకుని, ప్రస్తుతం రహస్యంగా సాగుతున్న ప్రతిఘటన నెట్‌వర్క్‌ను నడుపుతున్న పెట్రో ఆండ్రియుషెంకో మాట్లాడుతూ.. ఈ నెట్‌వర్క్‌లో మహిళలు ఎందుకు కీలకమో వివరించారు. ‘పురుషులు వెళ్లలేని చోట్లకు వెళ్లగలరు, పురుషులు చేయలేని పనులను వారు చేయగలరు. అంతేకాదు, శత్రువుల విషయంలో వారు చాలా నిర్దయాత్మకంగా వ్యవహరిస్తారు’’ అని ఆయన చెప్పారు.రష్యా దండయాత్రకు ముందు ఖేర్సొన్ సమీపంలో ఒక క్లినిక్‌లో ‘రొక్సానా’ (పేరు మార్చారు) అనే మహిళ పనిచేసేది. అక్రమణలోకి వచ్చిన తర్వాత వారి కింద పనిచేయడానికి ఇష్టంలేక ఆమె అక్కడి నుంచి పారిపోయింది. ఈ క్రమంలో ఆమె 33 రష్యా చెక్‌పోస్టులను దాటాల్సి వచ్చింది. దారిపొడవునా శవాలు, ముఖ్యంగా అత్యాచారాలకు గురైన మహిళల మృతదేహాలు ఆమెకు కనిపించాయి. ఒక చెక్‌పోస్ట్ వద్ద రష్యా సైనికులు ఆమె వాహనంపై కాల్పులు జరపడంతో తోటి ప్రయాణికుడికి గాయాలయ్యాయి.ప్రస్తుతం విదేశాల్లో ఉంటూ ఉక్రెయిన్ సైనిక నిఘా విభాగానికి 'టార్గెట్ వెరిఫైయర్'గా రొక్సానా పనిచేస్తోంది. ఖేర్సొన్ ప్రాంతంలోని ప్రతి ప్రాంతం గురించి ఆమెకు ఉన్న పాత అవగాహనతో డ్రోన్ దాడులు జరిపే ముందు ఆ లొకేషన్స్ సరైనవేనా? కాదా? అని నిర్దారిస్తుంది. ఒకప్పుడు తను నివసించిన ప్రాంతాలపైనే డ్రోన్ దాడులకు దారి చూపించడంపై ఆమెను ప్రశ్నించగా.. ‘‘గోడౌన్లను మనం మళ్లీ నిర్మించుకోవచ్చు. కానీ చనిపోయిన రష్యన్లు రష్యా మళ్లీ బతికించుకోలేదు కదా’’ అని ఆమె బదులిచ్చింది.శత్రువును హనీట్రాప్‌ చేయడంలో శిక్షణరష్యా సైనికులను హనీట్రాప్ చేసే ఉక్రెయిన్ నిఘా అధికారి సెర్హియ్.. ఒక నకిలీ మహిళా ప్రొఫైల్ ద్వారా ఆక్రమిత ప్రాంతంలోని 'అచ్మద్' అనే రష్యా సైనికుడ్ని లొకేషన్ పంపేలా ఒప్పించడానికి వారాల తరబడి చాటింగ్ చేశాడు. దీనికోసం ఉక్రెయిన్ నిఘా సంస్థలు ఆన్‌లైన్ మానిప్యులేషన్‌లో మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాయి. ముఖ్యంగా రష్యా తరఫున పోరాడుతున్న చెచెన్ సైనికులు ఇలాంటి వలపు వలల్లో చాలా సులభంగా చిక్కుకుంటారని అధికారులు చెబుతున్నారు.2014లో రష్యా మొదటిసారి ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి ‘ఉక్రేనియన్ ఉమెన్స్ గార్డ్’ విభాగానికి నాయకత్వం వహిస్తున్న ఒలెనా బిలెట్స్కా.. ఇప్పటివరకు 60,000 కంటే ఎక్కువ మందికి ఆత్మరక్షణ, ప్రతిఘటన పద్ధతులలో శిక్షణ ఇచ్చారు. ఆ మహిళల్లో కొందరు 2022 నాటి పూర్తి స్థాయి దండయాత్ర తర్వాత కూడా రష్యా ఆక్రమిత ప్రాంతాల్లోనే ఉండిపోయి, ఇప్పుడు అంతర్గతంగా పోరాడుతున్నారు.మెసేజ్ రావడం.. డ్రోన్ దూసుకుపోవడం!ఈ నిఘా సమాచారాలన్నింటి అంతిమ లక్ష్యం.. రష్యా సైనిక స్థావరాలపై దాడి చేయడమే. 426వ అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్ రెజిమెంట్‌కు చెందిన ఒక కమాండర్ మాట్లాడుతూ.. రాత్రిపూట తమ డ్రోన్ మిషన్లలో చాలా వరకు ఈ రహస్య నెట్‌వర్క్ ద్వారా అందే సమాచారం ఆధారంగానే జరుగుతాయని అన్నారు. శత్రువుల పోస్టులు, ఆయుధ డిపోల వంటి కీలక స్థావరాల సమాచారం అందిన కేవలం 15 నిమిషాల్లోనే అక్కడ డ్రోన్ దాడి జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అయితే, రష్యా సైనికుడు ఇటు చాటింగ్ చేస్తూ ఉండగానే.. అటు అతడి తలపై బాంబు పడిన ఘటనలు ఉన్నాయని అట్లాంటిక్ పేర్కొంది.ఆక్రమిత ప్రాంతాల భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉన్న శరణార్థులు జర్మనీ, పోలాండ్ వంటి దేశాల్లోని తమ కిచెన్ టేబుళ్లపై కూర్చుని ఉక్రెయిన్ సైన్యానికి టార్గెట్ వెరిఫైయర్లుగా సహాయపడుతున్నారు. వీరెప్పుడూ ఆయుధాలు చేతపట్టలేదు, కానీ శత్రువులను హతమార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాలన్నీ రష్యా సైనికులు చదవాలని ఉక్రెయిన్ కోరుకుంటోంది. ఎందుకంటే తమ చుట్టూ ఉన్న ప్రతి మహిళను చూసి రష్యా సైనికులు అనుమానంతో భయపడాలన్నదే వారి ప్లాన్.మరియుపోల్‌లో ‘సెస్ట్రా’ (కోడ్ నేమ్) అనే ఏజెంట్ మాట్లాడుతూ.. ‘మా భూభాగంపై అడుగు పెట్టిన ప్రతి రష్యా సైనికుడూ ప్రతి సెకనూ ఆ భయంతో, మానసిక ఆందోళనతో ఊపిరాడకుండా చావాలి’’ అని చెప్పింది. ‘మార్కెట్లో ఉండే ముసలమ్మను, బస్సు డ్రైవర్‌ను, క్లినిక్‌లోని డాక్టర్‌ను ఇలా ఎవర్ని చూసినా.. చివరికి రోడ్డుపై వెళ్లే ఏ సాదాసీదా మనిషిని చూసినా వారిలోనే తన మృత్యువు దాగుందని రష్యా సైనికుడు భయపడాలి’’ అని ఆమె స్పష్టం చేసింది.మాజీ ఎంపీ ఓరోబెట్స్ తాను విదేశాలకు వెళ్లినప్పుడు చాలా మంది ‘ఒకవేళ ఉక్రెయిన్‌లో పురుషులంతా మరణిస్తే పరిస్థితి ఏంటి?’ అని ఆందోళనగా అడుగుతుంటారు.. కానీ ఆమె దానికి నవ్వుతూ ‘మీరు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.. ఒకవేళ ఉక్రెయిన్ బాధ్యతలను మహిళలు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంటే, ఇక్కడ ఒక్క రష్యన్ కూడా ప్రాణాలతో మిగలడు’ అని బదులిస్తారు.