తూర్పుగోదావరి జిల్లాలోని మునికూడలికి మహర్దశ పట్టనుంది. స్వచ్ఛ గోదావరి-పవిత్ర పుష్కరాల థీమ్‌తో మోడల్ పుష్కర పంచాయతీలు అభివృద్ధి చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో మోడల్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అన్ని శాఖల సమన్వయంతో రూ. 7 కోట్ల నిధులు మంజూరు చేయించారు పవన్ కళ్యాణ్. సప్త రుషి ఘాట్‌ను అభివృద్ధి సహా మునికూడలి గ్రామ సమగ్రాభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, పర్యాటక ఆకర్షణ పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. మునికూడలి సప్త రుషి పుష్కరఘాట్ సమీపంలోని ఉమాపార్వతీ సోమేశ్వరస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం పునరుద్ధరణ, మరమ్మతు పనుల కోసం దేవాదాయ శాఖ రూ. 30 లక్షలు మంజూరు చేసింది. పుష్కరాల సందర్భంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వీలుగా 11కేవీ ఫీడర్, అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, లో టెన్షన్ లైన్ల నిర్మాణం, ఇతర పనుల కోసం రూ.1.41 కోట్లు కేటాయించారు. అలాగే సప్త రుషి ఘాట్ ఇరువైపులా సిమెంటు రోడ్డు నిర్మాణం, మునికూడలిలో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ. 1.23 కోట్లు కేటాయించారు.మరోవైపు మునికూడలి ఏపీలోనే తొలి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీగా రూపుదిద్దుకోనుంది మునికూడలి గ్రామం నుంచి విడుదలయ్యే మురుగు నీరు గోదావరిలో కలవకుండా గ్రామంలో 3.4 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం జరుగుతోంది. అలాగే అనుసంధాన రహదారులు, సామాజిక ఇంకుడు గుంతలు, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణం, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందుకోసం రూ. 68.2 లక్షలు మంజూరయ్యాయి. స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ నిధులతో సప్త రుషి ఘాట్ వద్ద 20 శాశ్వత మరుగు దొడ్ల నిర్మించనున్నారు. అలాగే గ్రామంలో చెత్త సేకరణ కోసం ఎలక్ట్రికల్ వాహనం అందుబాటులో ఉంచనున్నారు. రూ.10 లక్షలతో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం నిధులతో సప్త రుషి ఘాట్ వద్దకు వచ్చే భక్తులకు, మునికూడలి గ్రామ ప్రజల తాగునీటి అవసరాల కోసం రూ. 15 లక్షలు కేటాయించారు. పంచాయతీరాజ్ శాఖ నిధులను ఖర్చుచేసి గ్రామం మొత్తం వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నారు. సప్త రుషి ఘాట్‌లో రూ. 1.78 కోట్లతో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల సందర్భంగా భారీ ఫోకస్ లైట్లు, సుందరికరణ దీపాల ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ. 20 లక్షలు వెచ్చించనున్నారు. రూ. 15 లక్షలతో రెండు పిండ ప్రదానం షెడ్లు.. మర్రిచెట్టు ఆకారంలో టెర్రకోట డయాస్ పెయింటింగ్, బస్ షెల్టర్ నిర్మాణానికి రూ. 10 లక్షలు, రూ. 5 లక్షలతో పాత పాఠశాల భవనం మరమ్మతులు చేపట్టనున్నారు. అలాగే ఘాట్ సమీపంలో దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణానికి, జల్లు స్నానం ఏర్పాట్ల కోసం రూ. 25 లక్షలు ఖర్చు చేయనున్నారు.