తెలంగాణ తదుపరి సీఎస్‌‌గా సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు.. దాదాపు ఖరారు, కేంద్రం గ్రీన్‌సిగ్నల్?

Wait 5 sec.

తెలంగాణ తర్వాతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తెలంగాణ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజును తిరిగి సొంత కేడర్‌కు పంపించాలంటూ తెలంగాణ సర్కార్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు.. తిరిగి తెలంగాణ కేడర్‌కు రానున్నారు. దీంతో ఆయనకు తెలంగాణ సీఎస్ పదవీ బాధ్యతలు అప్పగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సర్వీసులైన ‘మినిస్ట్రీ ఆఫ్ డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్’ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆయనను వెంటనే పేరెంట్ కేడర్‌కు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (డీఓపీటీ) డైరెక్టర్ అన్నీస్ కన్మణి జాయ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన తెలంగాణ కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు పేరును తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి ఖరారు చేసినట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు పదవీ కాలం ఈనెల 30వ తేదీతో ముగిస్తుంది. ఈ క్రమంలోనే రానున్న ఒకట్రెండు రోజుల్లోనే కొత్త సీఎస్ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వం నుంచి వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక తెలంగాణ తదుపరి సీఎస్ పదవి కోసం పలువురు సీనియర్ అధికారుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సంజయ్ జాజుతో పాటు జయేశ్ రంజన్, వికాస్ రాజ్, సబ్యసాచి ఘోష్, నవీన్ మిట్టల్ వంటి సీనియర్ల పేర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉండగా.. సంజయ్ జాజు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చేంత వరకు ఉత్కంఠ కొనసాగనుంది. సంజయ్ జాజు 2024 ఫిబ్రవరి నుంచి కేంద్ర ప్రభుత్వంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.