భార్యపై అనుమానంతో గర్భిణి అని కూడా చూడకుండా ఓ భర్త నీచానికి పాల్పడ్డాడు. అనుమానం పెనుభూతమవ్వడంతో రోజూ వేధింపులకు గురి చేశాడు. రోజురోజుకూ అనుమానం పెరిగిపోవడంతో ఇంటికి తాళం వేసిమరీ చిత్రహింసలకు గురి చేశాడు. చివరికి అతి అమానుషంగా హతమార్చి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ గర్భిణి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్త ఆమెను ప్రతిరోజూ సుమార 10 గంటల పాటు ఇంట్లోనే బంధించే వాడని పోలీసులు చెబుతుంటే కళ్లు చెమ్మగిల్లకు మానవు. పోలీసుల వివరాల మేరకు.. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేసే అమిత్ గుప్తా, తన భార్య నేహా కుమారితో కలిసి హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉంటున్నాడు. అమిత్ గుప్తా ప్రతి రోజూ ఉదయం 8:30 నుంచి 9 గంటల మధ్య ఇంటి నుంచి బయల్దేరి, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగొచ్చేవాడు. భార్యపై అనుమానంతో ఉండే అమిత్ ఆమెను అస్సలు బయటకు వెళ్లకుండా చేశాడు. తాను ఇంట్లో లేనప్పుడు భార్య బయటకు వెళ్లకుండా, బయట నుంచి ఇంటికి ఎవ్వరూ రాకుండా మెయిన్ డోర్‌కి తాళం వేసి వెళ్లేవాడని పోలీసులు చెబుతున్నారు. నేహా ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పిందని, అయితే భర్తను ఎదిరించలేదని తెలిపారు. ఈ క్రమంలో గురువారం నేహాను దారుణంగా హ్యత చేసి అమిత్ ఇంటి నుంచి పరారయ్యాడు. అమిత్ గుప్తా తన భార్య తలను నీటితో నిండిని బకెట్‌లో బలవంతంగా ముంచి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు అమిత్ గుప్తా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసును పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, పరిచయస్తులు విచారిస్తూ పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.