US -Iran మధ్య మళ్లీ భీకర దాడులు.. "ఇరాన్ అనే దేశమే ఉండదు" ట్రంప్ వార్నింగ్‌తో ఉలిక్కిపడ్డ ప్రపంచం!

Wait 5 sec.

శాంతి ఒప్పంద చర్చలు ముగిసి వారం కూడా కాకముందే అమెరికా - ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం మొదలైంది. దాంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. అమెరికా వరుసగా రెండో రోజూ ఇరాన్‌పై వైమానిక దాడులు చేయగా, ప్రతీకారం తీర్చుకునేందుకు కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో వరుస దాడులకు తెగబడ్డది. దాంతో తాత్కాలిక కాల్పుల విరమణను ఇరు దేశాలు ఉల్లంఘించాయి. అసలు ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలముకోవడానికి కారణం.. హార్మూజ్ జలసంధి నుంచి ప్రయాణిస్తున్న కికు అనే చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌కు చెందిన వన్‌వే డ్రోన్ దాడి చేయడమేనని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ నౌకలో రెండు మిలియన్లకు పైగా బ్యారెళ్ల ముడి చమురు ఉందని సెంట్రల్ కమాండ్ తెలిపింది. కికు నౌకపై దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్‌లోని పది సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించాయి. నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, సముద్ర మైన్ల స్థావరాలు ఉన్నాయని సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. "కాలుల్ప విరమణ ఒప్పందాన్ని ఇరాన్ మరోసారి ఉల్లంఘించింది. అవసరమైతే అమెరికా ప్రారంభించిన సైనిక చర్యను పూర్తి చేస్తుంది. అలా జరిగితే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనే దేశమే ఇక ఉండదు" అని ట్రంప్ సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చారు. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి, డ్రోన్ దాడులు చేసినట్లు ప్రకటించారు. కువైట్‌లోని అలి అల్ సలేం ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ నావికా స్థావరం సహా ఎనిమిది కీలక సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. ఇరాన్ సైన్యానికి చెందిన ఖాతమ్ అల్ - అన్‌బియో సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం అల్ - ఫిఖారా మాట్లాడుతూ ఇకపై ఇరాన్‌పై ఎలాంటి దాడి జరిగినా తీవ్ర ప్రతీకారం తప్పదంటూ హెచ్చరించారు. హార్మూజ్ జలసంధిలో సముద్ర రవాణాపై ఇరాన్ మరింత కఠిన నిర్ణయాలు అమలు చేస్తోందని, శత్రు దేశాల నౌకలపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అమెరికా - ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న వేళ ఇలా జరగడంతో ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి.