బంగ్లాదేశ్ - చైనా డీల్‌తో భారత్‌కు కొత్త తలనొప్పి? డ్రాగన్ చేతికి మోంగ్లా పోర్టు!

Wait 5 sec.

బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహ్మాన్ చైనా పర్యటన భారత్‌కు కొత్త తలనొప్పులు తీసుకొచ్చేలా ఉంది. పర్యటన ముగిసిన తర్వాత విడుదలైన ఓ సంయుక్త ప్రకటన దక్షిణాసియా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటనలోని కొన్ని కీలక నిర్ణయాలు భారత్ - బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా - బంగ్లాదేశ్ సంయుక్త ప్రటకలో ఇరు దేశాలు తమ సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి. విదేశాంగ మంత్రుల స్థాయిలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటు దౌత్య రక్షణ రంగాల్లో నూతన పద్ధతులు పాటించేందుకు కీలక అడుగులు వేస్తున్నాయి. ఇరు దేశాల ఒప్పందాల్లో కీలకంగా మారిన మోంగ్లా పోర్టు ఆధునీకరణ విస్తరణ ప్రాజెక్టును భారత్ ప్రత్యేకంగా గమనిస్తోంది. మోంగ్లా పోర్టు అభివృద్ధి ప్రాజెక్టుతో పాటు చిట్టగాంగ్‌లోని చైనా ఎకనామిక్ అండ్ ఇండస్ట్రీయల్ జోన్ అభివృద్ధిని కూడా ఇరు దేశాలు కలిసి చేపట్టనున్నాయి. గతంలో మోంగ్లా పోర్టు టెర్మినల్ నిర్వహణ హక్కులను భారత్ పొందింది. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రభావాన్ని తగ్గించే వ్యూహాత్మక విజయంగా అప్పట్లో భావించారు. అయితే, తాజా ఒప్పందంతో ఈ ప్రాజెక్టులో చైనా ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టుకు కూడా చైనా మద్దతు ప్రకటించింది. నీటి వనరుల నిర్వహణ, వరదల నివారణ, హైడ్రాలజీ, నదుల డ్రెడ్డింగ్ వంటి రంగాల్లో బంగ్లాదేశ్‌తో కలిసి పనిచేస్తామని చైనా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ సమీపంలో ఉండటంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్‌లో భారత మాజీ హైకమిషన్ వీణా సిక్రీ మాట్లాడుతూ 2024లో మాజీ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటన సందర్భంగా మోంగ్లా పోర్టు, తీస్తా నీటి నిర్వహణ ప్రాజెక్టులు భారత్‌కు అప్పగించారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రధాని తారిఖ్ రహ్మాన్ ఆ ప్రాజెక్టులను చైనాకు అప్పగించడం నిరాశ కలిగించే విషయమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.