జులై 1 నుంచి EPF వ్యవస్థలో మార్పు.. ఇక 'పీఎఫ్' ఖాతాలో 25 శాతం కనీస నిల్వ తప్పనిసరి!

Wait 5 sec.

EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) త్వరలో కొత్త పథకాలను అమలులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇకపై వ్యక్తిగత పీఎఫ్ ఖాతాలో 25 శాతం కనీస నిల్వ తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపింది. విత్ డ్రాయల్ పరిమితి సంఖ్యను పెంచనుంది. సహా ఆటో మేషన్‌లో వేగంగా ఆమోదం లభిస్తే వెంటనే ఆ డబ్బులు సత్వరమే ఉద్యోగి బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా మార్పులు తీసుకొస్తోంది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ కేంద్రీకృత ఐటీ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తోంది. ఈపీఎఫ్ఓ పాస్‌బుక్, మెంబర్ పోర్టల్, యాజమాన్యాల పోర్టల్ తో పాటు వెబ్‌సైట్‌ను జూన్ 30వ తేదీ వరకు మూసి వేసింది. అలాగే క్లెయిమ్ పరిష్కార వ్యవస్థను సైతం నిలిపివేసింది. ప్రస్తుతం ఉన్న వెబ్‌సైట్ ఆధునికీకరించడంతో పాటు క్లెయిమ్ పరిష్కారానికి ఆటోమేషన్ వ్యవస్థను అప్ గ్రేడ్ చేస్తోంది. కొత్త వెబ్‌సైట్, క్లెయిమ్ వ్యవస్థ, కొత్త పథకాలు, ఐటీ వ్యవస్థలను జులై 1, 2026 నుంచే అమలులోకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఈపీఎఫ్ఓ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మూడు రోజుల పాటు ఈపీఎఫ్ సేవలు ఆపివేయడం, అప్ గ్రేడ్ చేస్తుండడంతో జులై 1 నుంచే కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ ఐటీ వ్యవస్థ అప్ గ్రేడేషన్ లో భాగంగా ఉద్యోగులకు 30వ తేదీలోపు ఖాతాల్లో జమ చేయనుంది. జులై 1వ తేదీన వడ్డీ జమతో కూడిన నగదు నిల్వల వివరాలను పీఎఫ్ ఖాతాల్లో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, కార్మికుల వ్యక్తిగత ఈపీఎఫ్ నిధిలో కనీసం 25 శాతం డబ్బు నిల్వ ఉంచి మిగిలిన మొత్తాన్ని మాత్రమే వెనక్కి తీసుకునేలా ఇప్పటికే సీబీటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తరచూ విత్ డ్రాలతో కార్మికులకు పదవీ విరమణ సమయంలో చేతిలో నిధి ఉండడం లేదని గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాతా చేతికి రూ.20 వేలు సైతం రాని వారి సంఖ్య ఎక్కువ ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఈ క్రమంలో రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు గౌరవప్రదమైన జీవనం కొనసాగించేందుకు వీలుగా 25 శాతం కనీస నిల్వ నిర్ణయించినట్లు ఈపీఎఫ్ఓ వర్గాలు తెలిపాయి. అంటే ప్రతి ఉద్యోగి క్లెయిమ్ దరఖాస్తు నాటికి ఉద్యోగి, కంపెనీ యజమాని వాటాలు, ఆ మొత్తంపై వడ్డీ కలపగా వచ్చేది మొత్తం ఈపీఎఫ్ నిల్వ అవుతుంది. అందులో కనీస నిల్వ ఉంచి మిగతా మొత్తం నుంచి మాత్రమే వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇస్తారు. ఇంతర వరకు కనీస నిల్వ నిర్వహించాలనే రూల్ లేదు. కొత్త పథకాలుకేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉద్యోగుల భవిష్య నిధి 2026, ఉద్యోగుల పింఛను స్కీమ్ 2026 అమలులోకి తీసుకురానుంది. ఈపీఎఫ్ 1952, ఈపీఎస్ 1995 స్కీమ్స్ స్థానంలో ఇవి వస్తున్నాయి. ఈపీఎఫ్ఓ కేంద్ర ట్రస్టీ బోర్డు ఇటీవలి సమావేశంలో ఆమోదం తెలిపింది. న్యాయశాఖ పరిశీలనలో ఈ పథకాలు పెండింగ్ లో ఉన్నాయి. కొత్త ఐటీ వ్యవస్థతో పాటుగా ఈపీఎఫ్, ఈపీఎస్ 2026 స్కీమ్స్ నోటిఫై చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.