తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ.. టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం

Wait 5 sec.

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆలయంలో నిర్వహించిన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలతో అనంత్ అంబానీకి ఆశీర్వచనం పలకగా.. టీటీడీ అధికారులు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేసి ఆయనను ఘనంగా సత్కరించారు. ఆలయ అధికారులు అనంత్ అంబానీతో కాసేపు సమావేశమై టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు సేవా కార్యక్రమాలను వివరించారు.ఈ సందర్భంగా అనంత్ అంబానీ టీటీడీకి భారీ విరాళం ప్రకటించారు. తిరుమల ఘాట్ రోడ్డులో పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా రూ.27.5 కోట్ల వ్యయంతో 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇచ్చేందుకు ఆయన అంగీకారం తెలిపారు. కేవలం బస్సులనే కాకుండా.. వాటి నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సైతం నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా.. ఆ బస్సులను నడిపే డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థే పూర్తి స్థాయిలో భరిస్తుందని అనంత్ అంబానీ స్పష్టం చేశారు.మరోవైపు, వీకెండ్ కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు శిలాతోరణం వరకు దాటి బాలాజీ నగర్ క్యాంపస్ వరకు విస్తరించాయి. దీనివల్ల టోకెన్లు లేని సాధారణ భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 24 నుంచి 26 గంటల సుదీర్ఘ సమయం పడుతోంది. భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరగడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో సోమవారం నాటి వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా ఆదివారం భక్తుల నుంచి ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదు. అలాగే వెబ్‌సైట్‌లో ఇన్‌స్టంట్‌గా జారీ చేసే 800 టికెట్లను సైతం తాత్కాలికంగా నిలిపివేశారు. వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదం, తాగునీరు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు.