విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) టార్గెట్‌గా మాజీ ఎంపీ సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్ వేదికగా మరో సంచలన పోస్టు పెట్టారు. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రగతి నగర్, షంషిగూడ పరిధిలో గల వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల కబ్జా యత్నాన్ని అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ఐటీ పార్క్ కోసం కేటాయించిన దాదాపు 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని.. దీనిని తక్షణమే నిలిపివేయాలని కేశినేని నాని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.ఈ భూవివాదం వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటు ఆయన బినామీలుగా వ్యవహరిస్తున్న మెసర్స్ ఎక్సెల్లా ప్రాపర్టీస్ ఉన్నట్లు కేశినేని నాని ఆరోపించారు. ఈ స్థలానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన జప్తు ఆదేశాలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విధించిన ఆంక్షల ఉనికిని పూర్తిగా దాచిపెట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ వాస్తవాలను మరుగున పరుస్తూ.. సుప్రీంకోర్టులో ఒక మోసపూరితమైన రాజీ ఒప్పందాన్ని ముందుకు తెచ్చి ప్రభుత్వ భూమిని నొక్కేయాలని చూస్తున్నారని నాని తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఈ వివాదాస్పద భూమిపై ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు ఎలాంటి యాజమాన్య హక్కులు లేవని గతంలో జిల్లా కలెక్టర్ సమర్పించిన అఫిడవిట్ ద్వారా స్పష్టమైందని కేశినేని నాని గుర్తుచేశారు. కలెక్టర్ నివేదిక ప్రకారం అక్కడ జీరో ప్రైవేట్ టైటిల్ ఉన్నప్పటికీ.. అక్రమార్కులు రాత్రికి రాత్రే అక్కడ ఆక్రమణలు ప్రారంభించారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో తెలంగాణ సీఎంవో అడ్వకేట్ జనరల్ ద్వారా తక్షణమే జోక్యం చేసుకుని ఈ అక్రమ భూ బదలాయింపు ప్రక్రియను కోర్టుల ద్వారా బ్లాక్ చేయాలని ఆయన కోరారు.హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు, ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా యంత్రాంగాన్ని ఈ స్థలంలో తక్షణమే రంగంలోకి దించాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. హైడ్రా దళాలను మోహరించి ఇప్పటికే మొదలైన ఆక్రమణలను పూర్తిగా తొలగించి, ఐటీ పార్క్ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి నకిలీ పత్రాలు, మోసపూరిత ఒప్పందాలు సృష్టించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటు ఆయన వెనకుండి నడిపిస్తున్న సూత్రధారులపై తెలంగాణ పోలీసులు తక్షణమే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కేశినేని నాని తన ట్వీట్‌లో డిమాండ్ చేశారు.