బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విజయవాడ నగరాల మధ్య ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి దాదాపు 12 నుంచి 13 గంటల సమయం పడుతుండగా.. దీనిని సగానికి సగం అంటే కేవలం 6 నుంచి 7 గంటలకే తగ్గించేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కోడూరు-ముప్పవరం యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే (NH-544G) పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్టును బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్‌ కారిడార్‌గా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది జూన్ లేదా జులై నాటికి ఈ ఆరు వరుసల అత్యాధునిక రహదారిపై వాహనాల రాకపోకలను ప్రారంభించాలనే స్పష్టమైన గడువుతో అధికారులు, నిర్మాణ సంస్థలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. భారతమాల పరియోజన మొదటి దశ కింద సుమారు రూ.14 వేల కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.ఈ కారిడార్‌లో బెంగళూరు నుంచి బయలుదేరిన తర్వాత ప్రస్తుతం ఉన్న బెంగళూరు-హైదరాబాద్ హైవేపై శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్ట్ సమీపంలో గల కోడూరు వరకు మొదట 110 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ కోడూరు వద్దే అసలైన యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి 342.24 కిలోమీటర్ల మేర సరికొత్తగా నిర్మిస్తున్న ఆరు వరుసల రహదారిపై ప్రయాణించి.. ప్రకాశం జిల్లాలోని ముప్పవరం వద్ద ప్రస్తుతం ఉన్న చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో కలవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మళ్లీ పాత హైవేపై 115 కిలోమీటర్లు ప్రయాణిస్తే విజయవాడ చేరుకుంటారు. అంటే మొత్తం ప్రయాణంలో మధ్యలో 342.24 కి.మీ. కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి ఉండగా.. దానికి అటూఇటూ కలిపి 225 కి.మీ. మేర ప్రస్తుతం ఉన్న హైవేలను వాడుకుంటారు. ఈ రోడ్డును శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప, నెల్లూరు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల మీదుగా నిర్మిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఈ రహదారి చిలమత్తూరు, గోరంట్ల, ఓడీసీ, పుట్టపర్తి, నల్లమాడ, ముదిగుబ్బ మీదుగా తలుపుల మండలంలోని నామాలగుండు వద్ద వైఎస్సార్ కడప జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ జిల్లా పరిధిలోని 75 కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికే 60 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. నవాబుపేట నుంచి నల్లమాడ మధ్య రహదారి నిర్మాణం పూర్తి కాగా.. నల్లమాడ నుంచి మలకవేముల క్రాస్ వరకు 15 కి.మీ. మేర రోడ్డు సిద్ధమైంది. మలకవేముల క్రాస్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతుండగా.. అక్కడి నుంచి కొండగట్టుపల్లి వరకు బీటీ లేయర్ వేస్తున్నారు. అయితే, పుట్టపర్తి మండలం సాతర్లపల్లి పరిధిలో కొండను తొలిచే పనులు మాత్రం కొంత నెమ్మదిగా సాగుతున్నాయి.ఇక వైఎస్సార్‌ కడప జిల్లాలో వేముల, పులివెందుల, ఎర్రగుంట్ల, కమలాపురం, చాపాడు, మైదుకూరు, పోరుమామిళ్ల మీదుగా ఈ హైవే సాగుతోంది. కమలాపురం మండలం కంచెన్నగారిపల్లె వద్ద పెన్నా నదిపై చాపాడు మండలం అల్లాడుపల్లి వద్ద కుందూ నదిపై భారీ వంతెనల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ జిల్లాలో కొన్నిచోట్ల భూసేకరణ సమస్యల వల్ల పనుల్లో కొంత జాప్యం కనిపిస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఈ రహదారి అత్యధికంగా 140 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సింగరాయకొండ నుంచి మైదుకూరు వైపు వెళ్లే ఎన్‌హెచ్‌-167బీ వద్ద ఇంటర్‌ ఛేంజ్ పనులు జరుగుతుండగా.. మర్రిపూడి నుంచి సోమవరప్పాడు వరకు 13వ ప్యాకేజీ పనులు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. ఈ ప్రాజెక్టులోనే అత్యంత కీలకమైన ఇంజనీరింగ్ అద్భుతంగా 5.31 కిలోమీటర్ల మేర మొత్తం ఏడు సొరంగాలు నిర్మిస్తున్నారు. ఇందులో నెల్లూరు జిల్లా సీతారామపురం మండల సరిహద్దులో నిర్మిస్తున్న 3.67 కిలోమీటర్ల పొడవైన సొరంగమే ఈ ప్రాజెక్ట్ మొత్తానికి అతి పెద్దది కావడం విశేషం.