Petrol Diesel Prices: ప్రపంచంలోనే చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలక మార్గంగా ఉన్న హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంది. హార్ముజ్ ద్వారా చమురు రవాణా సాధారణ స్థితికి చేరుకుంది. ఇక్కడ అమెరికా- ఇరాన్ మధ్య ముందుగా తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడం, తర్వాత స్విట్జర్లాండ్ వేదికగా శాంతి చర్చలు కూడా సానుకూలంగా సాగుతుండటం ఇందుకు కారణం. ఈ క్రమంలోనే చమురు రవాణా పెరిగి మార్కెట్లలో చమురు లభ్యత పెరిగింది. దీంతో క్రూడాయిల్ ధరలు భారీగా దిగొస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఇరాన్- అమెరికా యుద్ధం ముందు స్థాయిలకు పడిపోవడం విశేషం. ప్రస్తుతం జూన్ 25న వార్త రాసే సమయంలో బ్రెంట్ 2 శాతానికిపైగా తగ్గి 72 డాలర్ల దిగువకు చేరింది. ఇది ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభానికి ముందు నాటి స్థాయి అని చెప్పొచ్చు. దీంతో మళ్లీ మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరింత దిగువకు కూడా క్రూడాయిల్ ధరలు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. అమెరికా- ఇరాన్ యుద్ధం ప్రారంభం కాగానే హార్ముజ్ జలసంధి మూతపడింది. దీంతో చమురు ట్యాంకర్లు ఎక్కడికక్కడే గల్ఫ్ దేశాల్లో నిలిచిపోయాయి. దీంతో క్రూడాయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో చమురు లభ్యత లేక సంక్షోభం నెలకొంది. పలు దేశాల్లో తాత్కాలిక లాక్‌డౌన్స్ వంటివి కూడా విధించారు. ఇతర పొదుపు చర్యలు పాటించాయి. ఇదే సమయంలో ఇంధన ధరల్ని కూడా భారీగా పెంచుతూ వెళ్లాయి. ఒక దశలో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 126 డాలర్ల స్థాయికి కూడా పెరిగింది. అక్కడి నుంచి మళ్లీ భారీగా పతనం అవుతూ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే దాదాపు 40 శాతానికిపైగా పడిపోవడం విశేషం. మరి పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా?క్రూడాయిల్ రేట్లు ఇటీవల భారీగా పెరిగిన క్రమంలో దేశీయంగా చమురు సంస్థలు మే నెలలో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచేశాయి. లీటరుపై పలు దఫాల్లో కలిపి మొత్తంగా రూ. 7.50 కిపైగానే పెంచేశాయి. అయితే ఇప్పుడు చమురు ధరలు దిగొస్తున్నా వెంటనే దేశీయంగా ఈ ధరల్ని తగ్గించే అవకాశాలు కనిపించట్లేదని నిపుణులు అంటున్నారు. ఇటీవల ధరలు భారీ స్థాయిలో ఉండగా నష్టాల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఆ నష్టాల్ని పూడ్చుకునేందుకు ధరలు ఇంకొంత కాలం ఇదే స్థాయిలో ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటరుకు రూ. 115.73 గా ఉండగా.. డీజిల్ లీటరుకు రూ. 103.82 వద్ద ఉంది.