ఐపీఎల్‌లో అదరగొట్టిన టీమిండియా యువ సంచలనం ఇప్పుడు ఇంటర్నేషనల్‌లో అడుగుపెడుతున్నాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్ వేదికగా జరిగే వైట్ బాల్ సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్ట్ చేసింది. అయితే, 15 ఏళ్ల ఈ బుడ్డోడి కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పెషల్ రూల్స్ తీసుకొచ్చింది. అప్పుడెప్పుడో సచిన్ టెండూల్కర్ తర్వాత మళ్లీ ఈ బుడ్డోడికే ఈ ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నారు. 16 సంవత్సరాలలోపు ఆటగాళ్ల కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కొన్ని ప్రత్యేక నిబంధనలు విధించింది. ఈసీబీ మార్గదర్శకాల ప్రకారం 15 సంవత్సరాల వైభవ్ డ్రస్ ఛేంజ్ చేసుకునే సమయంలో సీనియర్ భారత ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను ఉపయోగించకూడదు. అందుకోసం వైభవ్‌కు ఒక ప్రత్యేక గతి కేటాయించారు. మ్యాచ్ సమయంలో, టీమ్ మీటింగ్ సమయంలో మాత్రం ప్రధాన డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండేందుకు అనుమతి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ సీనియర్ ప్లేయర్లు ఎవరైనా డ్రెస్ ఛేంజ్ చేసుకునే సమయంలో వైభవ్ అక్కడ ఉండటానికి వీల్లేదు. వాళ్లు డ్రెస్ ఛేంజ్ చేసుకున్న తర్వాత మాత్రమే వైభవ్ రూమ్‌లోకి వెళ్లాలి. 16 సంవత్సరాల ఆటగాళ్ల భద్రత కోసం ఈసీబీ ఈ ఏర్పాట్లు చేసింది. వైభవ్ ఇంగ్లండ్ టూర్‌కి వచ్చిన సందర్భంగా ఈ రూల్స్ అతనికీ వర్తించనున్నాయి. ఈసీబీ విధించనున్న ఈ నిబంధనలు జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే ఐర్లాండ్ సిరీస్‌లోనూ వర్తించనున్నాయి. ఐర్లాండ్‌తో భారత్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. దాని కోసం స్టోర్మాంట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత జట్టుకు మూడు వేర్వేరు గదులను కేటాయించినట్లు తెలుస్తోంది. వైభవ్ వయస్సును దృష్టిలో ఉంచుకుని అతని తల్లిదండ్రులు కూడా ఈ పర్యటనలో అతని వెంటే ఉండనున్నారు. జట్టుతో కలిసి ఒకే హోటల్‌లో వాళ్లూ బస చేయనున్నారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్ వైభవ్ సూర్యవంశీ కెరీర్‌ని కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది. 1980లలో ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) క్లబ్‌లో 18 ఏళ్లలోపు వారికి క్లబ్ హౌస్‌లోకి ప్రవేశం ఉండేది కాదు. కానీ సచిన్ 15 ఏళ్ల వయస్సులోనే సీసీఐ తరఫున ఆడేందుకు ఎంపిక కావడంతో క్లబ్ ఆ రోజుల్లో ప్రత్యేక మినహాయింపు ఇవ్వాల్సి వచ్చింది. అప్పట్లో డ్రెస్సింగ్ రూమ్‌లోకి 15 ఏళ్ల వయస్సులో ఎంట్రీ ఇచ్చిన ఆటగాడిగా సచిన్ నిలిచాడు. మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అలాంటి ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.