ఫ్రీ ఫైర్ మాయ.. ఆన్‌లైన్ కేటుగాళ్ల వల.. అమ్మ తిట్టిందని హైదరాబాద్ నుంచి బిహార్ బయల్దేరిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు

Wait 5 sec.

ఆన్‌లైన్ గేమ్స్ మాయలో పడి ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు ఇల్లు వదిలి ఏకంగా బిహార్ బయల్దేరిన ఘటన హైదరాబాద్ ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. ఆన్‌లైన్ పరిచయాలు, తల్లి మందలించిందన్న కోపంతో వెనకాముందు ఆలోచించకుండా రైలెక్కిన ముగ్గురు బాలికలను తెలంగాణ, ఏపీ పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్థానిక పాఠశాలలో 8, 9 తరగతులు చదువుతున్నారు. లాక్‌డౌన్ కాలం నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అలవాటు పడిన వీరు.. తమ కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లలో పాపులర్ ఆన్‌లైన్ గేమ్ అయిన ఫ్రీ ఫైర్ ఆడటం మొదలుపెట్టారు. ఈ గేమ్‌లో ఒకేసారి 4 నుంచి 16 మంది గ్రూప్‌గా కలిసి ఆడేందుకు వీలుండటంతో ఆట మధ్యలో వీరికి బిహార్ రాష్ట్రానికి చెందిన కొందరు గుర్తుతెలియని అపరిచిత వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ముదిరి రోజుకు గంటల తరబడి వారితో చాటింగ్ చేయడం, ఫోన్లలో మాట్లాడటం వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే రోజూ గేమ్స్ ఆడుతున్నందుకు ఇంట్లో తల్లి తరచూ కోప్పడుతూ, మందలిస్తోందని బాలికలు బిహార్ మాయగాళ్లతో పంచుకున్నారు. దీన్నే అదనుగా భావించిన ఆ సైబర్ నేరగాళ్లు.. 'మీ అమ్మ కోప్పడితే ఏమీ ఆలోచించకుండా వెంటనే బిహార్ వచ్చేయండి. ఇక్కడ మా దగ్గర చాలా ఫోన్లు ఉన్నాయి. మీరు రోజూ ఉచితంగా ఎంత సమయమైనా ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడుకోవచ్చు' అని ఆశ చూపారు.జూన్ 22న ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్న బాలికలపై తల్లి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ముగ్గురు మైనర్ బాలికలు.. ఆ మాయగాళ్ల మాటలు నమ్మి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని బిహార్ వెళ్లే రైలు ఎక్కేశారు. సాయంత్రం అయినా పిల్లలు ఇల్లు చేరకపోవడం, ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందిన తల్లి వెంటనే ఫలక్‌నుమా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాలికలు ఫ్రీ ఫైర్ ఆడిన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని.. సైబర్ క్రైమ్ సాయంతో లోతుగా దర్యాప్తు చేశారు. గేమ్ ఐడీ ఆధారంగా మొదట నగరానికే చెందిన ఓ బాలుడితో వీరు గేమ్ ఆడినట్లు గుర్తించి ఐపీ అడ్రస్ ద్వారా ఆ బాలుడిని పట్టుకుని ప్రశ్నించారు. ఆ బాలికలు బిహార్ వెళ్తున్నట్లు ఆ బాలుడు పోలీసులకు కీలక సమాచారం ఇచ్చాడు.మరోవైపు, ప్రయాణంలో ఉన్న బాలికలు రైలులో తమకు పరిచయమైన ఒక ప్రయాణికుడి మొబైల్ ఫోన్ తీసుకుని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తాము రైలులో బీహార్ వస్తున్నట్లు అక్కడి అపరిచితులకు మెసేజ్ చేశారు. దానికి స్పందించిన ఆ కేటుగాళ్లు.. 'బీహార్ వద్దు.. కోల్‌కతా రండి, ఇక్కడ ఇంకా చాలా గేమ్స్ ఆడుకోవచ్చు' అని రిప్లై ఇచ్చారు. ఈ సాంకేతిక సంభాషణను, ఐపీ అడ్రస్ డేటాను, వారు ఉపయోగించిన సదరు ప్రయాణికుడి ఫోన్ నంబర్ లొకేషన్‌ను పోలీసులు ట్రాక్ చేశారు. బాలికలు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్నట్లు నిర్ధారించుకున్న హైదరాబాద్ పోలీసులు, వెంటనే రైల్వే పోలీసులను, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు పోలీసులను అప్రమత్తం చేశారు. రైలు ఏలూరు స్టేషన్‌కు రాగానే పోలీసులు అప్రమత్తమై.. రైలు పెట్టెల్లో వెతికి ముగ్గురు బాలికలను గుర్తించారు. సైబర్ ముఠా చేతికి చిక్కకుండా బాలికలను కాపాడి తల్లికి అప్పగించారు. ఈ కేసులో వేగంగా స్పందించిన పోలీసులను సీపీ సజ్జనార్ అభినందించారు.