ఏపీ సీఎం భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఫౌండర్, ఛైర్మన్ భారతీ మిట్టల్‌ను ఆదివారం అమరావతిలో కలిశారు. రాష్ట్రంలో డిజిటల్ ఇన్‌ఫ్రాను బలోపేతం చేయడం, ప్రజలకు కనెక్టివిటీ పెంచడం గురించి వీరిద్దరూ చర్చించారు. మొబైల్ టవర్ కనెక్టివిటీ పెంచడం.. డేటా సెంటర్లలో పెట్టబడులను ప్రమోట్ చేయడం.. సముద్ర గర్భంలో ఇంటర్నెట్ కేబుళ్ల ల్యాండింగ్ స్టేషన్, రాష్ట్రంలో మొబైల్ సర్వీస్ ఆపరేటర్ల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత మెరుగుపర్చడం గురించి వీరిద్దరూ మాట్లాడుకున్నారు.భారతీ మిట్టల్, చంద్రబాబు నాయుడు మధ్య దాదాపు 3 గంటలపాటు చర్చలు జరిగాయని సమాచారం. ఈ భేటీ ముగిసిన తర్వాత భారతీ మిట్టల్‌ను చంద్రబాబు నాయుడు స్వయంగా కారు దాకా వచ్చి సాగనంపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆదివారం పూట అందరూ రెస్ట్ తీసుకోవాలని, కుటుంబంతో సరదాగా గడపాలని భావిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం శ్రమిస్తున్నారని.. 76 ఏళ్ల వయసులోనూ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.వ్యాపారవేత్తలను ఇంప్రెస్ చేయడం ఎలాగో చంద్రబాబు నాయుడికి తెలిసినంతగా మరే ఇతర రాజకీయ నాయకుడికి తెలియదంటే అతిశయోక్తి కాదు. 1990ల చివర్లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చినప్పుడు.. ఆయనకు చంద్రబాబు ఇచ్చిన ఆతిథ్యం.. ఆయనతో సాగిన చర్చలు.. కారు దాకా వచ్చి సాగనంపడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. చంద్రబాబు పని తీరు నచ్చడంతో హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కార్యాలయాన్ని బిల్ గేట్స్ ఏర్పాటు చేశారు.రతన్ టాటా తన నివాసానికి లేదా క్యాంప్ ఆఫీస్‌కు వచ్చిన ప్రతిసారి.. సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు స్వయంగా బయటకు వచ్చి, కారు డోర్ తీసి మరీ ఆయన్ను సాగనంపేవారు.నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా తొలి టర్మ్‌లో కియా ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వారితో ఇలాగే వ్యవహరించారు. కియా ప్రతినిధులతో చర్చలు ముగిసిన తర్వాత ఆఫీసు బయటకు వచ్చి.. వారు కారు ఎక్కేంత వరకు అక్కడే ఉండి వారికి వీడ్కోలు పలికారు. ఇతర పారిశ్రామికవేత్తలతోనూ చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తుంటారు.రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ కల్పించడం.. రాష్ట్రం పట్ల, తమ ప్రభుత్వ తీరు పట్ల పారిశ్రామికవేత్తల్లో సానుకూల వైఖరి ఏర్పడేలా చూడటం, పరిశ్రమల స్థాపనకు తమ ప్రభుత్వం ఎంతగా ప్రాధాన్యం ఇస్తుందో చెప్పడం కోసం.. పారిశ్రామికవేత్తలను తాము ఎంతగా గౌరవిస్తామో చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు ఇలా చేస్తుంటారు.అయితే ప్రజా ప్రయోజనాల విషయంలో సంస్థలు ఉదాసీన వైఖరితో ఉన్నాయని అనిపిస్తే మాత్రం చంద్రబాబు ఘాటుగానే స్పందిస్తారు. 2014లో హుదూద్ తుపాన్ వచ్చినప్పుడు విశాఖ ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆగిపోయాయి. టెలీకాం సంస్థలు అంత చురుగ్గా స్పందించడం లేదని భావించిన చంద్రబాబు.. సమక్షంలోనే ఎప్పటిలోగా మొబైల్ సేవలను పునరిద్ధరిస్తారో నాకు నేరుగా సమాధానం చెప్పండి అంటూ టెలీకాం ఎగ్జిక్యూటివ్‌లను ఆదేశించారు. దీంతో టెలీకాం ఆపరేటర్లు త్వరిగతన పనులు చేపట్టాయి. కొద్ది రోజుల తర్వాత టెలీకాం సేవల పునరుద్ధరణలో బాగా పని చేశారంటూ అదే సునీల్ మిట్టల్‌ను చంద్రబాబు ప్రశంసించారు.