టీ20 వరల్డ్‌కప్ 2026 ఛాంపియన్ టీమిండియా పరువు పోగొట్టుకుంది. ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత తొలి సిరీస్ ఆడిన భారత జట్టు ఐర్లాండ్‌పై దారుణ ఓటమిపాలయింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో చిత్తయిన భారత్.. కీలకమైన రెండో మ్యాచ్‌లోనూ చెత్త బ్యాటింగ్‌తో చేతులెత్తేసింది. దాంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0 - 2తో ఓటమిపాలయింది. ఐర్లాండ్ జట్టు తొలిసారి భారత్‌పై టీ20 సిరీస్ నెగ్గి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే ఐర్లాండ్ వికెట్లు కోల్పోయినప్పటికీ మిడిలార్డర్ రాణించడంతో ఐర్లాండ్ గౌరవప్రధమైన స్కోర్ చేసింది. హ్యారీ టెక్టర్ 47 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దాంతో ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇద్దరూ తొలి బంతికే వికెట్లు కోల్పోయారు. ఇద్దరూ గోల్డెన్ డకౌట్లుగా వెనుదిరిగారు. దాంతో ఒక్క పరుగుకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అవుటవ్వడంతో భారత్ 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ - తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను నిలబెడుతున్నారు అనుకున్న సమయంలో అనవసర రనౌట్‌కు ప్రయత్నించి ఇషనా్ రనౌట్ అయ్యాడు. దాంతో 5 ఓవర్లలోనే భారత్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ - తిలక్ వర్మ కలిసి 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర్, శివమ్ దూబే ఇద్దరూ భారీ స్కోర్స్ చేయకపోవడంతో భారత్ 109కే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆరంభం నుంచి ఒంటరి పోరాటం చేసిన తిలక్ వర్మ 46 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేసి అవుటవ్వడంతో భారత్ గెలుపు ఆశలు కోల్పోయింది. డెబ్యూ ఆటగాడు సూర్యాన్షు షెడ్జే ఐదు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటవ్వడంతో భారత్ ఓటమి ఖరారయింది. ఆఖర్లో హర్షిత్ రాణా భారత్‌ను గెలిపించినంత పనిచేశాడు. 10 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 21 పరుగులు చేసి ఆఖరి రెండు బంతుల్లో 8 పరుగులు కావాల్సి ఉండగా అవుటయ్యాడు. చివరి బంతికి ప్రిన్స్ యాదవ్ సిక్సర్ బాదగా ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ 154/8 పరుగులు చేయగా.. భారత్ 153/9 పరుగులు చేసింది.