‘పాకిస్థాన్ ఆర్మీ గో బ్యాక్’ అంటూ పీఓకేలో యువత, మహిళలు ఆందోళనలు ఉద్ధృతం

Wait 5 sec.

ఆక్రమణకు స్వస్తి పలకాలని, తమకు స్వాతంత్ర్యం కావాలని కోరుతూ గత రెండు వారాలుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లో కొనసాగుతోన్న ఆందోళనల్లోకి సోమవారం మహిళలు, పాఠశాల విద్యార్థులు భారీ ఎత్తున చేరడంతో మలుపు తీసుకుంది. నిరసనలకు ప్రధాన కేంద్రంగా ఉన్న రావల్‌కోట్ ఈద్గా మైదానంలో గత 11 రోజులుగా 70 వేల మందికిపైగా నిరసనలు కొనసాగిస్తున్నారు. సోమవారం ‘ గో బ్యాక్’, ‘కశ్మీరీలను పాక్ సైన్యం చంపుతోంది’, ‘పాకిస్థాన్ దాడిలో కశ్మీర్ నలిగిపోతోంది’, ‘మాకు ప్రాథమిక హక్కులు కావాలి’, ‘మేము ఉచిత విద్య కోరుకుంటున్నాం’, ‘ఆహారాన్ని ఆపేశారు.. ఇంటర్నెట్ నిలిపివేశారు’, ‘ఐక్యరాజ్యసమితి మా సమస్యలపై దృష్టి పెట్టండి’ అనే నినాదాలు రాసిన ప్లకార్డులను పదులు సంఖ్యలో స్కూల్ చిన్నారులు ప్రదర్శించారు. 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలు బహిరంగంగా స్వేచ్ఛా నినాదాలు చేయడం అనేది కొనసాగుతున్న ఆందోళనల్లో అత్యంత ముఖ్యమైన అంశం. ఇది ఆ ప్రాంతంలోని పెరుగుతున్న రాజకీయ అణచివేత, ఆర్థిక ఇబ్బందులు, సైనిక ఆధిపత్యంపై ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.పట్టణాలు, గ్రామాల్లో మహిళల కవాతుఇన్నాళ్లు రావల్‌కోట్‌‌కే పరిమితమైన నిరసనలు అనేక పట్టణాలు, గ్రామాలకు వ్యాపించాయి. సుధ్నోటి జిల్లాలోని తారర్ ఖేల్‌లో పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర్య నినాదాలు చేస్తూ ఒక బహిరంగ ప్రదేశంలో గుమిగూడారు. మంధోల్‌లో వందలాది మంది మహిళలు పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యాన్ని ఆక్రమణలనుగా ఖండిస్తూ స్వేచ్ఛ కోసం నినాదాలు చేశారు.ఈ నిరసనల ముఖ్య నిర్వాహకులలో ఒకరైన సర్దార్ అమన్ ఖాన్, ఈద్గా మైదానంలో గుమిగూడిన జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పీఓకే‌పై పాకిస్థాన్ పట్టు సడలుతోందని, తమకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయని హెచ్చరించారు. ‘‘పాకిస్థాన్ సైన్యం తన అణచివేతను కొనసాగిస్తే, మొత్తం సైనిక యంత్రాంగాన్ని పీఓకే నుంచి వెళ్లగొట్టాల్సి వస్తుంది’’ అని వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ఖాన్ అన్నారు.గతంలో బెంగాలీలకు జరిగిన అన్యాయాలను, అలాగే బలూచ్, పష్తూన్ ప్రజలపై నిరంతరం జరుగుతోన్న అణచివేత ఉదహరిస్తూ పాకిస్థాన్ సైన్యం రక్తచరిత్రను గుర్తుచేశారు. ‘‘పీఓకేలో కశ్మీరీలు ప్రశాంతంగా బతకలేనప్పుడు.. ఇక్కడ పాక్ సైన్యం మనుగడ కూడా ఉండదు’’ అని ఖాన్ వార్నింగ్ ఇచ్చారు.ఈ నిరసనలను అవామీ యాక్షన్ కమిటీ (AAC) సమన్వయం చేస్తోంది. 38 డిమాండ్లతో కూడిన ఒక చార్టర్‌ను ఆమోదించడానికి పాక్ ప్రభుత్వానికి జూన్ 23 వరకు డెడ్‌లైన్ విధించింది. ఆ డిమాండ్లను నెరవేర్చకపోతే రావలకోట్ నుంచి పీఓకే పరిపాలనా రాజధాని ముజఫరాబాద్ వరకు లక్ష మందికి పైగా నిరసనకారులతో భారీ మార్చ్ నిర్వహిస్తామని ఏఏసీ నాయకులు ప్రకటించారు. ముజఫరాబాద్‌లోని రాజకీయ సంస్థలపై ప్రజల నియంత్రణను సాధించడమే ఈ మార్చ్ లక్ష్యమని ఖాన్ స్పష్టం చేశారు. నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో రాజకీయ నాయకత్వ మార్పునకు దారితీసిన ప్రజా విప్లవాలతో ఈ ఉద్యమాన్ని ఆయన పోల్చారు.