ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసకు సీఎం జోసెఫ్ విజయ్ కీలక పదవి ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (TNMGRFTV) ఛైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ఇటీవలే అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తాజాగా పదవీ బాధ్యతలు చేపట్టిన మనోజ్ పరమహంస.. సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. విజయ్ బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తనపై నమ్మకం ఉంచి గొప్ప బాధ్యతను అందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అంటూ కొన్ని ఫోటోలను పంచుకున్నారు.''హ్యాపీ బర్త్ డే విజయ్ సర్, ప్రతి సంవత్సరం నేను మీకు వ్యక్తిగతంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేవాడిని. కానీ ఈ ఏడాది భిన్నమైనది. ఈ రోజు నన్ను తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌కు ఛైర్మన్‌గా నియమించి, మీరు నాపై ఒక గొప్ప బాధ్యత పెట్టారు. నేను నిజంగా ఆనందంతో, కృతజ్ఞతతో, ప్రగాఢమైన బాధ్యతా భావంతో ఉప్పొంగిపోతున్నాను. అంకితభావంతో, నిజాయితీతో సేవ చేస్తానని మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాను. ఫిలిం ఇండస్ట్రీకి, ఇన్‌స్టిట్యూట్‌కు మధ్య ఒక బలమైన సాంకేతిక వారధిని నిర్మించడం, ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ యొక్క లెగసీని పునరుద్ధరించడం, దానిని దేశంలోనే అత్యుత్తమ మీడియా సంస్థగా తీర్చిదిద్దడం నా లక్ష్యం. ఇలాంటి అవకాశాన్ని అందించిన తమిళనాడు ముఖ్యమంత్రికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై ఉంచిన నమ్మకానికి తగినట్లుగా నిలుస్తూ, సినిమా ఎడ్యుకేషన్ అభివృద్ధికి, మన విద్యార్థుల భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తాను'' అని మనోజ్ పరమహంస పేర్కొన్నారు. * ఇదిలా ఉంటే, ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌కు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ పరమహంసకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అభినందనలు తెలియజేశారు. ''ప్రముఖ ఛాయాగ్రహకులు మనోజ్ పరమహంస చెన్నైలోని ప్రముఖ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ‘ఎం.జి.ఆర్. ప్రభుత్వ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’ ఛైర్మన్ గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నియమించడం సంతోషదాయకం. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు. మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడిగా తెలుగు, తమిళ చిత్రాలకు పని చేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సినిమా రూపకల్పన, నిర్మాణ శైలులపై అవగాహన ఉన్న సాంకేతిక నిపుణుడాయన. చెన్నైలో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ నుంచే అన్నయ్య చిరంజీవి, రజనీకాంత్, సుహాసిని, నాజర్, రాజేంద్ర ప్రసాద్ లాంటి అగ్రశ్రేణి నటులు, పి.సి. శ్రీరామ్, పి.ఎస్. నివాస్ లాంటి సాంకేతిక నిపుణులు వచ్చారు. మనోజ్ పరమహంస నేతృత్వంలోనూ ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు రావాలని ఆకాంక్షిస్తున్నాను'' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మనోజ్ పరమహంస తమిళ్, తెలుగు, మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు. తెలుగులో 'ఏమాయ చేసావే', 'రేసుగుర్రం', 'కిక్ 2', 'బ్రూస్లీ', 'రాధేశ్యామ్', 'గుంటూరు కారం' వంటి డీఓపీగా వర్క్ చేసిన ఆయన.. పవన్ కళ్యాణ్ తో 'హరి హర వీరమల్లు', OG సినిమాలకు పని చేశారు. తమిళంలో తో కలిసి 'స్నేహితుడు', 'బీస్ట్', 'లియో' సినిమాకు కలిసి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి.. 'వైశాలి' సినిమాతో డీఓపీగా పరిచయమయ్యారు. నిర్మాతగా కూడా పలు సినిమాలను తెరకెక్కించారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. మనోజ్ పరమహంస చెన్నై MGR ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌ నుంచే వచ్చారు. ఇప్పుడు దానికే చైర్మన్ గా నియమించబడ్డారు.