తిరుమలలో మరో మోసం వెలుగుచూసింది. దళారులను నమ్మి మోసపోవద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా.. కొంతమంది భక్తుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం దళారులకు అవకాశంగా మారుతోంది. తాజాగా తిరుమలలో ఓ దళారిని నమ్మి సుమారు 60 మంది భక్తులు.. రూ.3.60 లక్షల మేరకు మోసపోయారు. సుప్రభాత సేవ టికెట్లు ఇప్పిస్తానని నమ్మబలికి.. భక్తుల నుంచి భారీగా వసూలు చేసినట్లు తెలిసింది. ఒక్కొక్కరి నుంచి రూ.6 వేలు చొప్పున.. 60 మంది నుంచి రూ.3.60 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. హైదరాబాద్, గుంటూరు, కర్ణాటకకు చెందిన 60 మంది భక్తులకు సుప్రభాత సేవ టికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికిన దళారి.. ఫోన్ ఫే ద్వారా వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖల పేరుతో జూన్ 23వ తేదీకి లేఖలు ఇచ్చారు. అయితే సోమవారం మధ్యాహ్నం నుంచి అతని ఫోన్ స్వి్చ్ ఆఫ్ వస్తోందని భక్తులు వాపోతున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తి తమను మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు దీనిపై విచారిస్తున్నారు. మిశ్రమ బియ్యం ఈ-వేలం మరోవైపు శ్రీవారి ఆలయం, టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన బియ్యాన్ని టీటీడీ వేలం వేయనుంది. జూలై ఏడో తేదీన ఈ-వేలం ద్వారా వీటిని విక్రయించనున్నారు. మొత్తం 7,938 కిలోల మిశ్రమ బియ్యాన్ని ఈ- వేల ద్వారా విక్రయిస్తారు. ఈ వేలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఆక్షన్ ఐడీ నెం. 26120 కింద జరుగుతుందని టీటీడీ తెలిపింది. ఆసక్తి ఉన్నవారు రూ.50,000 ఈఎండీ చెల్లించాలని.. వివరాలకు http://konugolu.ap.gov.in వెబ్‌సైట్‌ సందర్శించాలని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.ఖాళీ గోనె సంచుల వేలంటిటిడి ఆలయాలలో వాడిన ఖాళీ గోనె సంచులను టీటీడీ వేలం వేయనుంది. “రేట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన” విక్రయించేందుకు టీటీడీ ఈ-వేలం నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా Auction ID No. 26083 కింద జూన్ 30న ఈ-వేలం జరగనుంది. ఈ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు రూ.75,000 ఈఎండీ చెల్లించాలని టీటీడీ తెలిపింది.