నేనే అందరి కంటే పెద్ద జెన్ జీ.. నాకంటే ఇన్నోవేటివ్‌గా ఎవరూ ఆలోచించరు: చంద్రబాబు

Wait 5 sec.

జెన్ జీ.. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న మాట. మరీ ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిన తర్వాత జెన్ జీ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలోని జెన్ జీ తరానికి సీఎం చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. తానే అందరికంటే పెద్ద జెన్ జీ అని చెప్పిన చంద్రబాబు.. అందరూ ఏఐ టెక్నాలజీ నేర్చుకుని ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తే వారి బంగారు భవిష్యత్తుకు దారి చూపిస్తానని అన్నారు. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా కిష్టంశెట్టిపల్లిలో చంద్రబాబు పర్యటించారు. సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. మార్కాపురం జిల్లాను ఏర్పాటుచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. "యువత ఎక్కువగా ఉండే దేశం భారతదేశం. నేనెప్పుడూ యువతరం గురించే ఆలోచిస్తా. ఇప్పుడు జెన్ జీ అంటున్నారు. నేనే అందరికంటే పెద్ద జెన్ జీ. ఎప్పుడు ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తా. 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందనేదీ ఇప్పుడే ఆలోచిస్తా. 30 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు ఐటీ తెచ్చా. అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు ఆ ఐటీ అందరికీ ఆదాయాన్ని పెంచే మార్గం చూపించింది. ఇప్పుడు ఏఐ, క్వాంటం వ్యాలీ, డేటా సెంటర్లు వస్తున్నాయి, జెన్ జీ పిల్లలకు విజ్ఞప్తి చేస్తున్నా. అందరికంటే పెద్ద జెన్ జీ నేనే. నా కంటే ఇన్నోవేటివ్‌గా ఆలోచించేవారు ఉండరు. మీరు ముందుకొచ్చి ఏఐ, క్వాంటం నేర్చుకోండి. ఇన్నోవేటివ్‌గా ముందుకెళ్లేది నేర్చుకుంటే ఉపాధి కాదు బంగారు భవిష్యత్తుకు దారి చూపిస్తా." అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆగస్ట్ 15 నుంచి అన్ని జిల్లాలలో సంజీవనిమరోవైపు ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. మార్కాపురం పర్యటనలో చంద్రబాబు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. అన్ని జిల్లాలలోనూ ఆగస్టు 15 నుంచి సంజీవని అమలు చేస్తామని ప్రకటించారు. యోగా, ధ్యానం వంటి వాటిపై దృష్టి పెట్టాలని.. తాజా ఆహారం తీసుకుంటూ.. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. రైతులు కూడా తక్కువగా ఎరువులు ఉపయోగించాలని సూచించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామన్న చంద్రబాబు.. కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టును నిర్దేశిత సమయంలో పూర్తిచేస్తామన్నారు. వైసీపీ అమరావతి పర్యటనపై ..మరోవైపు వైసీపీ నేతల అమరావతి పర్యటన ఉద్రిక్తతలకు దారితీసిన సందర్భంపై చంద్రబాబు స్పందించారు. అమరావతిలో కుట్ర చేసేందుకు వైసీపీ నేతలు వెళ్లారన్న చంద్రబాబు.. అక్కడి రైతాంగం ఐదేళ్లు పోరాడిన కోపంతో ఉన్నారన్నారు. ఐదేళ్లు అమరావతి రైతులు, మహిళలను అవమానించి.. ఇప్పుడు వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని.. దీంతో అక్కడి రైతులు తిరగబడ్డారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.