ఇటీవల కర్ణాటకలోని హోస్పేటలో జరిగిన తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒకే వేదికను పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ అయి చర్చించారు. అయితే దీనిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ముగ్గురు ముఖ్యమంత్రుల రహస్య భేటీ వివరాలను బయటపెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్‌ను డిమాండ్ చేశారు. ముగ్గురు సీఎంల భేటీ చారిత్రకం అని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆ వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన .. కర్ణాటక ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారనే అనుమానం కలుగుతోందని తేల్చి చెప్పారు. అయితే ముగ్గురు సీఎంల సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని బయట కూర్చొబెట్టారని.. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిని కూడా బయట ఉంచేంత రహస్యం అందులో ఏముందని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన ఇంజనీర్లు, ఈఎన్సీని కూడా లోపలికి ఎందుకు రానివ్వలేదని నిలదీశారు. ఇంజనీర్లను, నీళ్ల మంత్రిని బయట ఉంచి ఆ ముగ్గురు గంటసేపు ఏం మాట్లాడుకున్నారు.. దాని వల్ల తెలంగాణకు ఏం ప్రయోజనం జరిగిందో అసెంబ్లీ వేదికగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.కర్ణాటక సర్కార్‌తో చేసుకున్న ఒప్పందాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవిష్యత్‌ను కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ చేతిలో ఎలా పెడతారని ప్రశ్నించారు. చంద్రబాబు ఏం చెబితే కేంద్ర ప్రభుత్వం అది వింటుందని.. చంద్రబాబు పలుకుబడితో ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని కేంద్ర ఇరిగేషన్ అధికారిగా నియమించారని తీవ్ర ఆరోపణలు చేశారు. నదీ జలాలకు సంబంధించి ఎలాంటి కనీస అవగాహన కూడా లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞానం.. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనంగా మారిందని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పోరాటం చేసి సాధించిన ప్రాజెక్టుల అనుమతులను గాలికి వదిలేసిన కాంగ్రెస్.. తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ భవిష్యత్తును రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల కాళ్ల వద్ద తాకట్టు పెడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణను ముంచుతుంటే.. అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రి.. వారితోనే కలిసి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనాలను రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని.. పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని తీవ్ర హెచ్చరికలు చేశారు.