ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ప్రశంసలు కురిపించారు. భారత్‌ను ప్రపంచంలో మరింత ప్రభావవంతమైన శక్తిగా తీర్చిదిద్దడంలో మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. ఇదే సమయంలో భారత్, అమెరికా సంబంధాలను కూడా ప్రస్తావిస్తూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ ఇంతకంటే సన్నిహితంగా ఉండలేరని అన్నారు. ‘‘అమెరికాకు భారత్ అత్యంత సన్నిహిత భాగస్వామి, మిత్రదేశం... ప్రధానమంత్రి, అధ్యక్షుడి మధ్య సంబంధం ఇంతకంటే సన్నిహితంగా ఉండదు. దౌత్యంలో ఇది చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను’’ అని వైట్‌హౌస్‌ వద్ద ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రూబియో తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం ప్రధాని మోదీని ఎంతో గౌరవిస్తుందని, భారతదేశాన్ని అమెరికాకు అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తుందని ఆయన అన్నారు. ‘‘ప్రధానమంత్రి మోదీకి, ఆయన చేసిన పనులకు మేమంతా పెద్ద అభిమానులం’’ అని నొక్కి చెప్పారు.ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అద్భుతమైన ఆర్థిక ప్రగతిని సాధిస్తోందని, ప్రపంచ నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇప్పుడు మరింత ప్రాముఖ్యత కలిగిన ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని ఆయన అన్నారు. ప్రపంచంలో పెరుగుతున్న భారత్ ప్రభావం న్యూఢిల్లీ-వాషింగ్టన్ సంబంధాలను బలోపేతం చేసిందని ఆయన నొక్కి చెప్పారు. అలాగే ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి విలువలు, ప్రయోజనాలు పలు రంగాలలో సహకారాన్ని విస్తరించడానికి బలమైన పునాది వేశాయని అమెరికా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.‘‘ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశాలు.. మన మధ్య ఎన్నో సారూప్యతలు, ఉమ్మడి అంశాలు ఉన్నాయి.. వాటిపై మనం కలిసికట్టుగా నిర్మించుకుని, కలిసి పనిచేయగలమని నేను భావిస్తున్నాను’’ అని ఆయన అన్నారు. ఆర్థిక రంగం, సప్లయ్ ఛైన్‌, కీలక ఖనిజాలు, ఇంధనం, భద్రత, నౌకాయాన స్వేచ్ఛ వంటి రంగాలలో భారత్, అమెరికా సహకారాన్ని మరింతగా పెంపొందించుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ఇవన్నీ మనల్ని కలిపి ఉంచే అంశాలే’’ అని అన్నారు.భారత సంతతి సమాజం తమ దేశాన్ని సుసంపన్నం చేసిందని, భారత్-అమెరికా సంబంధాలు వృద్ధి చెందడానికి సహాయపడిందని రూబియో తెలిపారు. ‘‘మా దేశంలో చాలా బలమైన భారతీయ అమెరికన్ సమాజం కూడా ఉంది... ఇది మన దేశాల మధ్య అదనపు బంధం. ఈ సమాజం మన దేశాన్ని అనేక విధాలుగా సుసంపన్నం చేసింది’’ అని ఆయన అన్నారు.