జాబిల్లిపై ల్యాండర్ 200 రోజుల మనుగడే లక్ష్యం.. అణుశక్తి సంస్థతో చేతులు కలిపిన ఇస్రో

Wait 5 sec.

చంద్రుడిపై అన్వేషణ కోసం మరో మిషన్‌కు సిద్ధమవుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ().. జాబిల్లి ఉపరితలాన్ని అన్వేషించే జీవితకాలాన్ని పొడిగించే వ్యవస్థ రూపకల్పనలో అణుశక్తి విభాగంతో కలిసి పనిచేయనుంది. ఈ కృత్రిమ న్యూక్లియర్ హీటింగ్ వ్యవస్థ.. అత్యంత శీతల వాతావరణంలోనూ ల్యాండర్‌లోని బ్యాటరీలు, పరికరాలను వెచ్చగా ఉంచుతుంది. దీనివల్ల ల్యాండర్ 200 రోజుల వరకూ పనిచేయగలదని, చంద్రుడిపై రాత్రి ( భూమిపై 14 రోజులు) సమయంలో ఉండే మైనస్ 180 డిగ్రీల సెల్సియస్ అంత కంటే తక్కువ ఉష్ణోగ్రతలను కూడా ఇది తట్టుకోగలదని శాస్త్రవేత్తలు తెలిపారు.చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా జాబిల్లి దక్షిణ ధ్రువంలోని శివశక్తి పాయింట్ వద్ద విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగినప్పటికీ, రెండు వారాల తర్వాత దాని జీవితకాలం ముగిసింది. ఆర్బిటర్ సహాయంతో ల్యాండర్‌ను మేల్కొలిపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రేడియోధార్మిక ఐసోటోప్ ప్లూటోనియం-238 నుంచి ఉత్పన్నమయ్యే వేడి ల్యాండర్‌ను వెచ్చగా ఉంచుతుంది. ఇందుకోసం రేడియోఐసోటోప్ హీటర్ యూనిట్లను ఉపయోగిస్తారు. అలాగే, లోపల ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్రత్యేక ఇన్సులేషన్, స్మార్ట్ థర్మల్ కంట్రోల్ సిస్టమ్‌లు ఉన్నాయి. ఇది చలిని తట్టుకోగలిగితే, పగటివేళ సోలార్ ప్యానెళ్ల నిరంతరాయంగా వేడిని ప్రసారం చేస్తుంది. ప్లూటోనియం 238 నుంచి తక్కువస్థాయిలో రేడియోధార్మికత వెలువడటం వల్ల అది ఇతర పరికరాలపై ప్రభావం చూపదు.చంద్రుడి ఉపరితలంపై ఉండే అత్యంత శీతల వాతావరణం నుంచి ల్యాండర్‌ను రక్షించడానికి ఒక అధునాతన కృత్రిమ హీటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు తాము అణుశక్తి విభాగంతో కలిసి పనిచేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ఇటీవల వెల్లడించారు. సౌరశక్తితో పనిచేసే చంద్రయాన్-3 'విక్రమ్' ల్యాండర్ జాబిల్లిపై కేవలం 14 రోజులు మాత్రమే పనిచేసిందని.. ఇప్పుడు ఏకంగా 200 రోజుల పాటు మనుగడ సాగించగల ల్యాండర్‌ను అభివృద్ధి చేయడానికి అణుశక్తి విభాగంతో కలిసి ఇస్రో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ హీటర్లతో కూడిన ఈ ల్యాండర్ అక్కడ ఉండే కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడగలదని, ఇది భవిష్యత్తులో చేపట్టబోయే సుదీర్ఘ అంతరిక్ష పరిశోధనలకు ఎంతగానో సహాయపడుతుందని ఆయన వెల్లడించారు.చంద్రునిపై ఒక రోజు.. భూమిపై 28 రోజులకు సమానం (పగలు, రాత్రులు ఒక్కొక్కటి దాదాపు 14 రోజులు). అక్కడ పగటి ఉష్ణోగ్రత 121 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటే.. రాత్రి వేళల్లో మైనస్ 129 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులను ల్యాండర్ తట్టుకునేలా అణుశక్తి సహాకారంతో హీటింగ్ వ్యవస్థను రూపకల్పన చేయనున్నారు.