ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న స్మార్ట్ కిచెన్ల విధానంపై మాజీ ముఖ్యమంత్రి, అధినేత మోహన్ రెడ్డి మండిపడ్డారు. గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతూ 20ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవారు చాలామంది ఉన్నారన్న వైఎస్ జగన్ .. ప్రస్తుత ప్రభుత్వం స్మార్ట్‌ కిచెన్స్‌ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్కచెల్లెమ్మలను మాత్రం రోడ్డున పడేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. మధ్యాహ్న భోజనం వండేవారికి ఇవ్వాల్సిన జీతాలు గత రెండు నెలలుగా బకాయిపెట్టారని విమర్శించారు.పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు గతంలో వేయి రూపాయలుగా ఉండే జీతాన్ని.. తాము అధికారంలోకి రాగానే మూడు వేలకు పెంచామని జగన్ గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ఇంకా మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు స్మార్ట్‌ కిచెన్ల పేరుతో వారిని తొలగించి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారని ఆరోపించారు. మధ్యాహ్నభోజన కార్మికుల తరఫున వైసీపీ పోరాడుతుందని.. అండగా ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు బకాయిపెట్టిన జీతాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలను పెంచాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఈ స్మార్ట్ కిచెన్ విధానం తీసుకువచ్చింది. ప్రతి మండల కేంద్రంలో ఒక స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి.. అక్కడి నుంచే మండలాలలోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయాలని ప్రణాళికలు రచించారు. విద్యార్థులకు అత్యుత్తమ నాణ్యత, రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు ఈ స్మార్ట్ కిచెన్ ఆలోచన చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ స్మార్ట్ కిచెన్లలలో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన వంటవారిని నియమిస్తారు. వీరు అధునాతన వంటశాలల్లో భోజనం తయారు చేస్తారు. రోజూ మెనూ ప్రకారం వంటలు వండి.. ప్రత్యేక వాహనాల ద్వారా పాఠశాలలకు సరఫరా చేస్తారు. అయితే ఈ అందుబాటులోకి వస్తే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే కార్మికులు ఉపాధి కోల్పోతారని వైసీపీ విమర్శిస్తోంది.