హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న మెయిన్ రోడ్డుకు అవెన్యూగా నామకరణం చేస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అమెరికా రాయబారి సెర్గియో గోర్ కలిసి ఇటీవల.. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూను ప్రారంభించారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఈ వ్యవహారంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు. హైదరాబాద్‌లోని ఒక రోడ్డుకు తన పేరు పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వానికి డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌లోని హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు అయిందని.. ఈ రకమైన గౌరవం దక్కించుకున్న తొలి అమెరికా అధ్యక్షుడిని తానే అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే థాంక్యూ అని ట్రంప్ రాసుకొచ్చారు.అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఈ నెల 23వ తేదీన అమెరికా కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ అవెన్యూగా పేరు పెట్టారు. ఈ క్రమంలోనే శిలాఫలకాన్ని సెర్గియో గోర్, భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమెరికా, భారత్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలమైంది అంటూ ఇద్దరు నేతలు వెల్లడించారు. ఈ క్రమంలోనే కేవలం అమెరికా కాన్సులేట్‌ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడం మాత్రమే కాదని.. ఇక నుంచి మరిన్ని ఇలాంటి నిర్ణయాలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గ్లోబల్ ఐటీ హబ్‌గా దూసుకెళ్తున్న హైదరాబాద్‌ నగరంలో ఉన్న మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీల కార్యాలయాలకు అతి సమీపంలోనే ఈ డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ ఉండటం విశేషం. ఇది వ్యాపారపరంగా, వ్యూహాత్మకంగా ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయంగా మరింత పెంచడమే కాకుండా.. భవిష్యత్తులో మరిన్ని అమెరికన్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. తొలిసారి ఈ ట్రంప్ అవెన్యూకు ప్రతిపాదనలు చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరమ్ వార్షిక సదస్సులోనూ గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన వ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రోడ్లకు పెట్టడం ద్వారా వారికి గౌరవం కల్పించడంతో పాటు.. హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ వంటి పేర్లను కూడా తెలంగాణ సర్కార్ పరిశీలిస్తోంది.