హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. విశ్వనగరంగా ఎదుగుతున్న క్రమంలో జనాభా పెరిగిపోవడం, వారికి అనుగుణంగా వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, స్కైవేలు నిర్మిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు కావాల్సిన అన్ని చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు ఆ రోడ్డును అధికారులు 3 నెలల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి-డీఎల్ఎఫ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. ట్రిపుల్ఐటీ జంక్షన్ ఫ్లైఓవర్ పనుల కారణంగా 90 రోజుల పాటు ఆ రోడ్డు మూసివేయనున్నట్లు వెల్లడించారు. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మల్టీ లెవల్ ఫ్లైఓవర్.. అండర్‌పాస్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండగా.. ఆ పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు.. డీఎల్ఎఫ్ గేట్ నంబర్ 1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రోడ్డును పూర్తిగా మూసివేయనున్నారు. జూలై 1వ తేదీ నుంచి 3 నెలల పాటు ఆ రోడ్డు మూసి ఉంటుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కనీసం ఒక సంవత్సరం సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం కీలకమైన పిల్లర్ల నిర్మాణం, గడ్డర్ల అమరిక పనుల కోసం 90 రోజుల పాటు ఈ రోడ్డును మూసివేయాల్సి వస్తోందని తెలిపారు. పనులు జరిగే సమయంలో అప్పుడప్పుడు కొంత మార్గాన్ని తెరిచే అవకాశం ఉన్నప్పటికీ.. ట్రాఫిక్ జామ్‌లు కాకుండా ఉండేందుకు ఐటీ ఉద్యోగులు, నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు. అయితే ఈ మార్గంలో ఉన్న ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగుల కోసం కొన్ని మినహాయింపులు ఇచ్చారు. నాన్ ఎస్‌ఈజెడ్ గేట్ ద్వారా టీసీఎస్ ఉద్యోగులు రాకపోకలు సాగించేందుకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలోనే రోడ్డు మూసివేత నేపథ్యంలో ఆ మార్గంలో వాహనాలు మళ్లించేందుకు సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టమైన గైడ్‌లైన్స్ ప్రకటించారు. మొదటి రూట్ ప్రకారం.. రాడిసన్ హోటల్ నుంచి డీఎల్ఎఫ్ మీదుగా ట్రిపుల్ ఐటీ జంక్షన్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కేవలం డీఎల్ఎఫ్ గేట్ నంబర్ 1 వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడి నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లి.. అక్కడ కుడి మలుపు తీసుకుని ఇందిరానగర్ మీదుగా ట్రిపుల్ ఐటీ జంక్షన్‌కు చేరుకోవచ్చు. రెండో రూట్ ప్రకారం.. లింగంపల్లి నుంచి వచ్చి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీదుగా డీఎల్ఎఫ్ బిల్డింగ్ లేదా రాడిసన్ హోటల్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్ వద్ద మళ్లిస్తారు. ట్రిపుల్ ఐటీ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ చేరుకుని.. అక్కడ ఎడమ మలుపు తీసుకుని రాడిసన్ జంక్షన్ మీదుగా తిరిగి ఎడమ మలుపు తీసుకుని డీఎల్ఎఫ్ రోడ్డుకు చేరుకోవాలని సూచించారు. ఐటీ ఉద్యోగుల ప్రయాణం సురక్షితంగా, సాఫీగా సాగేందుకు వాహనదారులు సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.