తెలంగాణ రైతులకు శుభవార్త చెబుతూ.. మంగళవారం రోజున రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి అర్హులైన అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. అయితే ఈ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గమైన మధిరలో.. రైతు ఆశీర్వాద సభ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. ఆ సభ చివరి నిమిషంలో రద్దు అయింది. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వ వర్గాలు ఈ సభను రద్దు చేశాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌ నుంచి రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో వేయనున్నారు. మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురం వద్ద మంగళవారం రోజున రైతు ఆశీర్వాద సభ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే సోమవారం రోజున సభాస్థలిని పరిశీలించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి సభను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. గత 2 రోజులుగా ఆ ప్రాంతంలో కుండపోత వానలు కురుస్తుండడంతో వాతావరణం అనుకూలించడం లేదని.. దీంతో సభను రద్దు చేసే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారీ వర్షాలకు సభా ప్రాంగణంం మొత్తం వరద నీటితో నిండిపోయినట్లు గుర్తించారు. ఇక ఈ రైతు ఆశీర్వాద సభ రద్దు కావడంతో.. త్వరలోనే ఆ ప్రాంతంలో రైతు భరోసా ఆత్మీయ సభను నిర్వహిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. దాదాపు లక్ష మందితో రైతు ఆశీర్వాద సభను నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు తరలించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని చేపట్టనుండగా.. అక్కడి నుంచే సీఎం రేవంత్ రెడ్డి నిధులను రిలీజ్ చేయనున్నారు.