తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 1.5 శాతం కట్.. మే నెల వేతనం నుంచే అమలు

Wait 5 sec.

, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మరింత సమర్థవంతంగా ఆరోగ్య సేవలను అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ) నిధికి ప్రతి ఉద్యోగి, పెన్షనర్ నుంచి మూల వేతనం లేదా మూల పింఛనులో 1.5 శాతం చందాగా మినహాయించాలని తెలంగాణ ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జీవో నంబర్ 79ను సోమవారం విడుదల చేసింది.రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ ఏడాది మే నెల వేతనాలు, పెన్షన్ల (జూన్‌లో చెల్లించేవి) నుంచే ఈ 1.5 శాతం కోత అమల్లోకి రానుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత ప్రతీ నెలా ఇదే విధంగా 1.5 శాతం మొత్తాన్ని ఈహెచ్‌ఎస్ హెల్త్ ఫండ్‌కు.. ఉద్యోగుల జీతాల్లో నుంచి జమ చేస్తారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులపై అనవసర భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు కూడా తీసుకొచ్చింది. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నా.. లేక ఒకరు ఉద్యోగి, మరొకరు ప్రభుత్వ పెన్షనర్‌గా ఉన్నా.. కేవలం ఒక్కరి జీతం లేదా పింఛను నుంచి మాత్రమే ఈ కోత విధించనున్నారు.అదేవిధంగా ఒకే వ్యక్తి సర్వీస్ పెన్షన్‌తో పాటు ఫ్యామిలీ పెన్షన్ కూడా పొందుతున్నా ఒకసారి మాత్రమే ఈహెచ్‌ఎస్ చందాను మినహాయించనున్నారు. ఒకే ఫ్యామిలీపై రెండుసార్లు భారం పడకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక భార్యాభర్తలు ఇద్దరి జీతాల నుంచి లేదా ఒకే వ్యక్తికి రెండుసార్లు ఈహెచ్‌ఎస్ చందా పొరపాటున కట్ అయితే.. ఆ మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు ఐఎఫ్ఎంఐఎస్-హెచ్ఆర్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగులు, పెన్షనర్ల వివరాలను సరిచూసి.. డబుల్ కటింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.ఇక ఉద్యోగులు, పెన్షనర్లు చెల్లించే 1.5 శాతం మొత్తానికి సమానమైన అదే మొత్తాన్ని ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్‌కు మ్యాచింగ్ గ్రాంట్‌ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. దీంతో ఆరోగ్య పథకానికి అవసరమైన నిధులు మరింత బలోపేతం కానున్నాయి. ఇక ఈ ఉద్యోగుల ఆరోగ్య పథకం నిర్వహణ కోసం ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ)ని పునర్వ్యవస్థీకరించింది. ఈ ట్రస్ట్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనుండగా.. ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఇక ఉద్యోగుల నుంచి సేకరించే నిధులన్నీ ప్రత్యేక అకౌంట్ ద్వారా.. ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య అవసరాలకే వినియోగించనున్నారు. ఈ నిర్ణయంతో ఉద్యోగుల ఆరోగ్య పథకానికి స్థిరమైన నిధులు సమకూరుతాయని.. భవిష్యత్తులో వైద్య సేవల నిర్వహణ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.